ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజులు

10 Nov, 2020 02:38 IST|Sakshi

‘మేనేజ్‌మెంట్‌’ వసూళ్లను అడ్డుకునేందుకు అదే మార్గం 

కన్వీనర్‌ ద్వారానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ?

అప్పుడే వసూళ్ల దందాకు తెర.. 

ఆ దిశగా మొదలైన ఆలోచనలు

మేడ్చల్‌ సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో వార్షిక ఫీజు రూ. 89 వేలు.. అయినా కాలేజీ యాజమాన్యం మేనేజ్‌మెంట్‌ కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటుకు వార్షిక ఫీజు కలుపుకొని నాలుగేళ్లకు రూ. 9 లక్షలు తీసుకుంటోంది.. ఘట్‌కేసర్‌ సమీపంలోని మరొక కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సీటుకు రూ.12 లక్షల డొనేషన్‌తో పాటు ఏడాదికేడాది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును వసూలు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అగ్రశ్రేణి కాలేజీలతో పాటు, కొద్ది పేరున్న వాటిలో యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇదీ.. యాజమాన్య కోటాకు ప్రత్యేక ఫీజు లేకపోయినా, కన్వీనర్‌ కోటా ఫీజునే యాజమాన్య కోటాలో వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా కూడా అదేమి పట్టకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మేనేజ్‌మెంట్‌ కోటా పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుకు హేతుబద్ధత ఏంటన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. యాజమాన్యాలు నిర్ణయించి వసూలు చేస్తున్నదే అధికారిక ఫీజు అన్న విధంగా పరిస్థితి తయారైంది.

ఈ నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ, ఫీజుల విధానంపైనా వివిధ కోణాల్లో ఆలోచనలు మొదలయ్యాయి. మెడికల్‌ తరహాలో రెండు రకాల ఫీజుల విధానం ప్రవేశపెట్టి, కన్వీనర్‌ ద్వారానే ఆ సీట్లను భర్తీ చేస్తే అడ్డగోలు వసూళ్ల దందాకు తెరపడుతుందన్న ఆలోచనలను అధికారులు చేస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో ఉన్న ఫీజుపై 50 శాతం లేదా ఎంతో కొంత మొత్తాన్ని పెంచి యాజమాన్య కోటా ఫీజుగా ఖరారు చేస్తే యాజమాన్యాలకు ఊరటతో పాటు, యాజమాన్య కోటాలో సీట్లు కావాలనుకునే తల్లిదండ్రులపైనా భారం తగ్గుతుందన్న వాదనలున్నాయి. మరోవైపు కన్వీనర్‌ ద్వారా ప్రభుత్వమే ఆ సీట్లను భర్తీ చేస్తే ఎలాంటి అక్రమాలకు తావుండదని, మెరిట్‌ విద్యార్థులు టాప్‌ కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి. అయితే అది అంత తొందరగా ఆచరణ రూపం దాల్చుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నిబంధనలతో పారదర్శకత సాధ్యం కాదా?
ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజుల విధానం ఆచరణలోకి వచ్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీలో పారదర్శకత ఉండేలా చూడటం సాధ్యం కాదా..? అంటే అవుతుందనే చెప్పవచ్చు.. ఇటు హైకోర్టు కూడా మేనేజ్‌మెంట్‌ కోటాలో పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు.

ప్రభుత్వం ఏం చేసిందంటే..
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు అనేక నిబంధనలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 74, 75 జీవోలను, 2012లో 66, 67 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా.. 2014 ఆగస్టు 14న 13, 14 జీవోలను జారీ చేసింది. అయితే జీవో 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాజమాన్య కోటాలో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికి దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది.

మారదర్శకాలు ఇవీ..
బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్‌ విండో తరహాలో అధికార యంత్రాంగం ఒక వెబ్‌ పోర్టల్‌ను తయారు చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి ఒక యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. మరోవైపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలివ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కాలేజీలో రెండు, మూడు కోర్సులను ఎంచుకుంటే ప్రాధాన్య క్రమం ఇవ్వాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మెరిట్‌ ప్రకారమే ఎంపిక చేశారని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్‌లైన్‌లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి.

ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే..
ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. జీవో 66, 67లను కోర్టు సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని సూచించింది. అందులో దరఖాస్తులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు విద్యార్థిని ఇంటర్వ్యూ చేసే వీలుంది. అలాగే వారి ఆర్థిక స్థోమత తెలుసుకొని సీట్లను కేటాయించే అవకాశమివ్వాలని, ఒకవేళ యాజమాన్యం ఆ విద్యార్థిని తిరస్కరిస్తే అందుకు గల కారణాలను ఉన్నత విద్యా మండలికి తెలియజేయడం వంటి అంశాలను చేర్చాలని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే అప్పటివరకు 5 శాతమే ఉన్న ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను కూడా 15 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. 

అమలుకు నోచుకోని ఉత్తర్వులు..
హైకోర్టు సూచించిన మేరకు 66, 74 జీవోలకు సవరణ చేస్తూ ప్రభుత్వం.. 2014 ఆగస్టు 14న జీవో 13ను జారీ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశం ఇక్కడ లేకుండాపోయింది. దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి, దానిని అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే ఆన్‌లైన్‌ విధానాన్ని మళ్లీ తెచ్చేందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది.

రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డుకట్ట..
కోర్టు తీర్పులు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా సీట్లు అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆధారం లేకుండా ఏ చర్యలు చేపట్టే అవకాశం లేదు. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డగోలు వసూళ్లను అడ్డుకోవచ్చు. కన్వీనర్‌ కోటా ఫీజు కంటే యాజమాన్య కోటా ఫీజు కొంత పెంచి, కన్వీనర్‌ ద్వారా భర్తీ చేస్తే పారదర్శకత ఉంటుంది. తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.
 – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌

అలా చేస్తే అభ్యంతరం లేదు..
రెండు రకాల ఫీజుల విధానం తెస్తే మాకేమీ అభ్యంతరం లేదు. సీట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పోతాయి. సీట్ల భర్తీ వ్యవహారం కూడా కన్వీనరే చేస్తారు కనుక మాపై భారం తగ్గుతుంది. అయితే కన్వీనర్‌ కోటా కంటే యాజమాన్య కోటా ఫీజు రెట్టింపు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ విధానాన్ని తెస్తే స్వాగతిస్తాం..
– గౌతంరావు, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు