నవంబర్‌ 1 నుంచి ఫస్టియర్‌కు క్లాసులు

16 Aug, 2020 07:37 IST|Sakshi

బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ తదితర కోర్సుల్లో..

వచ్చే నెల 1 నుంచి సీనియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

సాంకేతిక, వృత్తి విద్యాసంస్థల్లో కార్యక్రమాలపై ఏఐసీటీఈ తాజా షెడ్యూల్‌

ప్రవేశ పరీక్షలు పూర్తి చేసి అక్టోబర్‌ 20లోగా తొలిదశ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్ ‌: దేశవ్యాప్తంగా సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో తరగతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 1 నుంచి సీనియర్‌ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మొదలుకానుండగా.. ఫస్టియర్‌ విద్యార్థులకు నవంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభమవనున్నాయి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతి (క్లాస్‌రూం)లో నిర్దేశించిన విధంగా సీనియర్‌ విద్యార్థులకు తొలుత బోధన పెట్టాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. పాఠ్యాంశ బోధనతో పాటు కళాశాలల గుర్తింపు, మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ తదితర కార్యకలాపాలపైన స్పష్టమైన తేదీలను సూచించింది.

ఇక సాంకేతిక, వృత్తి విద్య యూజీ, పీజీ కోర్సు (బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర) ల్లో ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్‌ ఒకటో తేదీ నాటికి రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ 2020–21ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ క్యాలెండర్‌ ఆధారంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినప్పటికీ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనలు చేస్తే మార్పులు చేసే అవకాశముంటుందని తెలిపింది.

అకడమిక్‌ క్యాలెండర్‌లో సవరణలివే...
సెప్టెంబర్‌ 1 నుంచి సీనియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తి కానందు న వారిని మినహాయించి మిగతా తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభించా లి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో లేకుంటే బ్లెండెడ్‌ మోడ్‌ (రెండు విధాలుగా)లో బోధన చేపట్టొచ్చు. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులకు మాత్రం బోధన తరగతుల నిర్వహణకు ఈ తేదీ వర్తించదు.
ప్రతి విద్యా సంస్థకు సంబంధిత యూనివర్సిటీ లేదా బోర్డు అనుబంధ గుర్తింపునిస్తుంది. ఈ ప్రక్రియ వాస్తవానికి మే నెల15వ తేదీలోగా పూర్తి కావాలి. తాజాగా ఈ అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ సెప్టెంబర్‌ 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఏఐసీటీఈ ఆదేశించింది. నిర్దేశించిన గడువులోగా విద్యా సంస్థను తనిఖీ చేసి మౌలిక వసతులు, సౌకర్యాలను పూర్తిగా పరిశీలించి ఆమేరకు అనుబంధ గుర్తింపును జారీ చేయాలి.
వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెట్‌లను త్వరితంగా నిర్వహించి అక్టోబర్‌ 20వ తేదీ నాటికి తొలి విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. ఆమేరకు అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. అదేవిధంగా నవంబర్‌ ఒకటో తేదీ నాటికి రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్‌ ఒకటో తేదీ నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. అదే రోజు నుంచి ఫ్రెషర్స్‌కు తరగతులు ప్రారంభమవుతాయి.
వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే నవంబర్‌ 10వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలి. మొత్తంగా 15వ తేదీ నాటికి కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు చేరాలి. 

కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో..
ఏఐసీటీఈ ఏప్రిల్‌లో అకడమిక్‌ క్యాలెండర్‌ను తొలుత విడుదల చేసినప్పటికీ కోవిడ్‌ నేపథ్యంలో మార్పులు చేసి జూలై 2న సవరించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. అయితే విద్యా సంస్థలు తెరిచేందుకు కేంద్రం అనుమతినివ్వలేదు. ఈక్రమంలో వీటి మూసివేత ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా వివిధ సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం వెసులుబాటునిస్తూ వచ్చిం ది. దీంతో వచ్చేనెలలో విద్యా సంస్థలు తెరుచుకుంటాయని సంకేతాలు వస్తుండటంతో ఏఐసీటీఈ తాజాగా మరిన్ని సవరణలు చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ విడుదల చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు