COVID-19 vaccine: పిల్లలకు కరోనా టీకా ఎలా?

6 Nov, 2021 22:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లలకు కరోనా టీకా వేయించడం ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. 12–18 ఏళ్ల వయసు వారికి టీకా వేయాలంటే తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి. కానీ పిల్లలకు కరోనా వ్యాప్తి పెద్దగా లేదన్న అభిప్రాయంతో చాలామంది తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ వేయించేందుకు ముందుకు రావడం లేదు. గతంలో వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేలను చూస్తే, అమెరికాలో 50 శాతం మంది తమ పిల్లలకు టీకా ఇవ్వడానికి ఆసక్తి చూపగా, మిగిలిన సగం మందిలో సందిగ్ధత, నిరాసక్తత కనిపించాయి.

కెనడాలో 63 శాతం మంది, టర్కీలో 36 శాతం ఆసక్తి చూపారు. మిగిలినవారిలో నిరాసక్తత, సందిగ్ధత నెలకొన్నాయి. ఇక భారత్‌లో ఎయిమ్స్‌ సంస్థలు, చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి, ముంబైకి చెందిన క్రాంతి మెడికల్‌ కాలేజీలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సర్వే చేపట్టాయి. పిల్లలకు కరోనా టీకా వేయించే విషయంపై జరిగిన మొదటి సర్వే ఇదే కావడం గమనార్హం. పిల్లలకు వ్యాక్సినేషన్‌ చేయించడంపై 45.5 శాతం మంది సందిగ్ధంలో ఉన్నట్లు వెల్లడికాగా.. 21 శాతం మంది తమ పిల్లలకు టీకా వద్దే వద్దంటున్నారు. కేవలం 33.5 శాతం మందే టీకాపై ఆసక్తి చూపించారు. సర్వే నివేదిక మెడ్‌ ఆర్‌ఎక్స్‌ఐవీ మేగజైన్‌లో ప్రచురితమైంది. 

టీకా సామర్థ్యంపై అపనమ్మకం 
దేశంలో అక్టోబర్‌ 25 నాటికి 100 కోట్ల మంది కనీసం ఒక డోస్‌ టీకా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా నడుస్తోంది. 12–18 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సినేషన్‌పై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకట్రెండు టీకా తయారీ కంపెనీలకు అనుమతి కూడా ఇచ్చారు. త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే పిల్లలకు టీకా వేయించేందుకు ఎంతమంది ముందుకు వస్తారన్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు.

సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు 30 నుంచి 49 ఏళ్లలోపువారున్నారు. అందులో 23 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు. 32 శాతం మంది ఆదాయం రూ.50 వేలపైనే ఉంటుంది. 41 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారున్నారు. సగం మంది సామాజికంగా ఉన్నతస్థాయిలో ఉన్నారు. భారతీయ వ్యాక్సిన్‌పై 39 శాతం మంది విశ్వాసం వ్యక్తంచేయగా, నమ్మకం లేనివారు 25 శాతం ఉన్నారు. 36 శాతం మంది తటస్థంగా ఉన్నారు. 

పిల్లలకు వ్యాక్సిన్‌ వద్దనేందుకు కారణాలు 
 వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యంపై  85 శాతం మందికి అవగాహన లేదు.   
 సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయా రావా అన్న దానిపై 78 శాతం మందికి 
అవగాహన లేదు.  
  65 శాతం మందికి కరోనా డోస్‌ల మీద అవగాహన లేదు. 
 62 శాతం మంది వ్యాక్సిన్‌తో రిస్క్‌ ఉంటుందని భావిస్తున్నారు.  
  50 శాతం మందికి కరోనాకు సంబంధించి శాస్త్రీయమైన సమాచారం అందుబాటులో లేదు. 
 చిన్నపిల్లలు కరోనాకు పెద్దగా ప్రభావితం కావడం లేదన్న భావనలో 50 శాతం మంది ఉన్నారు.  

భయాలను పారదోలాలి
తల్లిదండ్రులకు పిల్లల వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి. వారికున్న భయాలను పారదోలాలి. చదువుకున్నవారు మాత్రం టీకాపై మంచి అభిప్రాయంతో ఉన్నారు. కానీ చిన్న పిల్లలకు వేయించడంపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పోగొట్టాలని సర్వే సూచించింది.  
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

మరిన్ని వార్తలు