ఏ చిన్న ఆధారాన్నీ వదలం

19 Dec, 2021 03:44 IST|Sakshi

సీడీఎస్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ చౌదరి

వీవీఐపీ ప్రొటోకాల్స్‌ను పునః పరిశీలిస్తాం

దుండిగల్‌లో జరిగిన ఫ్లైట్‌ క్యాడెట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ కూలిన ఘటనలో ఏ చిన్న ఆధారాన్నీ వదలబోమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి స్పష్టం చేశారు. ప్రమాదానికి వాతావరణ పరిస్థితులు కారణమా, మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అని తెలుసుకునేందుకు త్రివిధ దళాల ఎంక్వైరీ టీమ్‌ నేతృత్వంలో ‘కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ’ కొనసాగుతోందని తెలిపారు.

వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాలకు చెందిన 175 మంది ఫ్లైట్‌ క్యాడెట్ల శిక్షణ ముగిసిన సందర్భంగా శనివారం దుండిగల్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. ముఖ్య అతిథిగా వివేక్‌ రామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘సీడీఎస్‌ హెలికాప్టర్‌ కూలిన ప్రాంతంలో దొరికిన అన్ని ఆధారాలను పరిశీలించి ప్రతి సాక్షిని విచారించాలి.

ఇందుకు కొంత సమయం పడుతుంది’ అని చెప్పారు. హెలికాప్టర్‌ దుర్ఘటన నేపథ్యంలో వీవీఐపీ ప్రొటోకాల్స్‌ను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రోటోకాల్స్‌ను సమీక్షించనున్నట్లు వెల్లడించారు.  

అవసరమైతే తూర్పు లద్దాఖ్‌కు అదనపు బలగాలు 
తూర్పు లద్దాఖ్‌లో అదనపు బలగాల అవసరమైతే తక్షణం తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చౌదరి చెప్పారు. ‘అక్కడ కొన్ని ప్రాంతాల్లో భారత్, చైనా తమ బలగాలను వెనక్కి రప్పించాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తత అలాగే ఉంది. గల్వాన్‌ ఘటన తర్వాత ఏప్రిల్‌ నుంచీ పరిస్థితిలో మార్పు లేదు’ అని అన్నారు. రాఫెల్, అపాచీ, చినూక్‌ మొదలైన వాటితో ఎయిర్‌ ఫోర్స్‌ అత్యంత బలమైన వైమానిక దళంగా మారబోతోందని చెప్పారు.

క్యాడెట్లలో 28 మంది మహిళలు 
శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది క్యాడెట్‌లలో 28 మంది మహిళలున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు అవార్డులను చౌదరి ప్రదానం చేశారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ రావత్, ఆయన సతీమణి, సాయుధ దళాలకు చెందిన 12 మం ది సిబ్బందికి గౌరవ సూచకంగా హవాక్, చేత క్, కిరణ్‌ విమాన విన్యాసాలు నిర్వహించలేదు. 

మరిన్ని వార్తలు