న్యూస్‌ రీడర్‌ ఏడిద ఇకలేరు

13 Nov, 2020 03:31 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్ ‌: ‘ఆకాశవాణి..వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు..’అంటూ ఢిల్లీ కేంద్రంగా మూడు దశాబ్దాలుగా గంభీరస్వరంతో అనేక జాతీయ,అంతర్జాతీయ వార్తలు వినిపించిన రేడియా న్యూస్‌ రీడర్‌ ఏడిద గోపాలరావు(83) గురువారం బోరబండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ కేంద్రంగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన రంగస్థలంపై కూడా తనదైన ముద్రవేసి రంగస్థల గాంధీగా పేరు సంపాదించారు. 1995లో పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు వారధిగా నిలిచారు. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు సోదరుడు. కాగా, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో గోపాలరావు అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడు శ్యామ్‌ రాజా చితికి నిప్పంటించారు.  

సీఎం కేసీఆర్‌ సంతాపం 
ఏడిద గోపాలరావు మరణం పట్ల సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చద వడం ద్వారానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతులు సంపాదించారని సీఎం గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాల రావు మృతిపై దూరదర్శన్, ఆకాశవాణి ప్రోగ్రాం సిబ్బంది సంతాపాన్ని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం 
అమరావతి : ఏడిద గోపాలరావు మృతికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న గోపాలరావు.. వివిధ సాంస్కృతిక, కళా సంఘాలతో అనుబంధం కొనసాగించారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

రచయిత్రి శాంతసుందరి కన్నుమూత 


హైదరాబాద్ ‌: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు ఆర్‌.శాంతసుందరి(74) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా బ్రెయిన్‌ కేన్సర్‌తో బాధపడుతున్న శాంతసుందరి రెండు నెలల క్రితం కోమాలోకి వెళ్లిపోయారు. ఈమె ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు కుమార్తె. హిందీ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీలోకి అనేక పుస్తకాలను అనువదించారు. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో తల్లి వరూధిని, భర్త గణేశ్వరరావు, కూతుళ్లతో పాటు బంధుమిత్రుల సమక్షంలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు