Hyderabad: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే..

24 Sep, 2021 09:24 IST|Sakshi
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం: 78లోని భరణి లేఅవుట్‌ కాలనీకి వెళ్లే రోడ్డు

ఏపుగా పెరిగిన చెట్లతో రంగురంగుల పూల మొక్కలతో పరుచుకున్న పచ్చదనం ఒక వైపు... అందమైన ఆకృతులలో రాళ్ల వరుసలు మరోవైపు... ఇదీ జూబ్లీహిల్స్‌ కాలనీలో ఆకట్టుకునే తీరు. నాణ్యమైన ప్రాణవాయువుకు జూబ్లీహిల్స్‌ కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెలువరించిన నివేదికలో జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో నాణ్యమైన వాయువు ప్రజలకు అందుతోందని వెల్లడించింది.  – బంజారాహిల్స్‌ 

క్రమం తప్పకుండా... 
సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన నేషనల్‌ ఎయిర్‌ క్వాలిటీ, మానిటరింగ్‌ ప్రోగ్రామ్‌లలో ఎక్కడెక్కడ గాలి ఎలా ఉందన్నదాన్ని అంచనా వేస్తుంటారు. ప్రతినెలా ఈ లెక్కింపు ఉంటుంది. దీని ప్రకారమే నగరంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి గాలి లభిస్తుందన్నది నివేదిక ద్వారా స్పష్టం చేస్తున్నారు. ప్రతిసారి జూబ్లీహిల్స్‌ స్వచ్ఛమైన గాలికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నది.

చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం, కాలనీల్లో కూడా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేకపోవడం, కాంక్రీట్‌ జంగిల్‌గా మారకపోవడంతో ఇక్కడ ప్రతిసారి స్వచ్ఛమైన లభించేందుకు కారణమవుతున్నాయి. ఎయిర్‌ క్వాలిటి ఇండెక్స్‌(ఎక్యూఐ) నివేదిక ప్రకారం నగరంలోని స్వచ్ఛమైన గాలి జూబ్లీహిల్స్‌లో లభిస్తున్నట్లుగా గుర్తించారు. నగరంలో 32 చోట్ల ఏర్పాటు చేసిన నేషనల్‌ ఎయిర్‌ క్వాలిటి మానిటరింగ్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఏఎంపీ)ల ద్వారా ఎక్కడెక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు.

గుడ్, సాటిస్‌ఫ్యాక్టరీ, మాడరేట్, పూర్, వెరీపూర్, సెవర్‌ తదితర అంశాలలో ఎక్కడెక్కడ ఏ రకమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. దీని ప్రకారమే జూబ్లీహిల్స్‌లో స్వచ్ఛమైన గాలి లభిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నెల మొదటి వారంలో గుర్తించిన జాబితాలో జూబ్లీహిల్స్‌ మొదటి స్థానం దక్కించుకుంది. 

పచ్చదనమే కారణం... 
జూబ్లీహిల్స్‌ కాలనీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పచ్చదనం ఎక్కువ. ఇక్కడ అపార్ట్‌మెంట్ల కంటే వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా ఉండటం, ఆ నివాసాల్లో మొక్కలు, చెట్లతో పాటు రోడ్లకు రెండువైపులా భారీ వృక్షాలు కూడా స్వచ్ఛమైన గాలి రావడానికి కారణమని కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్ట్‌లు పేర్కొంటున్నారు. 

కేబీఆర్‌ పార్కు కూడా... 
జూబ్లీహిల్స్‌ కాలనీని ఆనుకొని 360 ఎకరాల్లో కేబీఆర్‌ పార్కు విస్తరించి ఉన్నది. పార్కులో 70 శాతం దట్టమైన అడవి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్వచ్ఛమైన గాలితో ఉంటున్నాయి. జూబ్లీహిల్స్‌ కాలనీకి కేబీఆర్‌ పార్కు పచ్చదనం కూడా ఒక వరంగా మారిందనే చెప్పాలి.   

చదవండి: Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్‌

మరిన్ని వార్తలు