ఓల్డ్‌ సిటీ సంగతేంటి?: అక్బరుద్దీన్‌ ఆగ్రహం

17 Sep, 2020 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ అద్భుతంగా పురోగమిస్తోందని, హైటెక్‌ సిటీ ప్రాంతం గత 20 ఏళ్లలో ఎంతో పురోగమించి ఇప్పుడు భారతదేశ న్యూయార్క్‌గా గుర్తింపు పొందిందని మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్న పాతనగరం అదే దుస్థితిలో ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిం చాల్సి ఉందని, పాత నగరానికి ఐటీ సెంటర్‌ రావాలని డిమాండ్‌ చేశారు. పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌గా ఉండగా, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్‌ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్‌ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్‌ భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పాతనగరంలో పార్కింగ్‌ టవర్లను పూర్తి చేయాలని కోరారు. నవ యవ్వనంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నువ్వు జుట్టు నెరిసి వృద్ధుడివి అవుతున్నావు తప్ప పాతబస్తీ అభివృద్ధి చెందటం లేదని ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్‌ చేసి చెప్తానని పేర్కొన్నారు.

నా మాటల్లో తప్పుందని తేలితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. పీజేఆర్‌ మోనో రైల్‌ కోసం, తాను మెట్రో కోసం పోటీ పడగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను ఢిల్లీకి పంపి మెట్రో రైలు ప్రాజెక్టు పరిశీలించి రమ్మన్నారని, ఆ తర్వాతనే నగరానికి మెట్రో వచ్చిందని, కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీకి మాత్రం మెట్రో యోగం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా ఫేజ్‌–2 పాతనగరం కోసం ఏర్పాటైందని, కానీ కొత్త నగరంలో అమలవుతున్నట్టు పాతనగరానికి రోజువిడిచి రోజు నీళ్లు రావటం లేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టుగానే, నీటి విషయంలో పాతబస్తీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాలుగు వేల ఎకరాల వైశాల్యంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను ఇప్పుడు వేయి ఎకరాలకే పరిమితం చేశారని, లుంబినీపార్కు, నెక్లెస్‌రోడ్డు, ఫుడ్‌కోర్టులకు ఎవరు అనుమతిచ్చారని అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా