ఉల్లాసంగా.. ఉత్సాహంగా...

7 Oct, 2022 01:07 IST|Sakshi
అలయ్‌–బలయ్‌ కార్యక్రమంలో వీహెచ్, విద్యాసాగర్‌రావు, చిరంజీవి, దత్తాత్రేయ, ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ 

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో దత్తన్న అలయ్‌–బలయ్‌..!

హాజరైన వివిధ రంగాల ప్రముఖులు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలోని విభిన్న వర్గాల మేలుకలయికగా ‘దత్తన్న అలయ్‌–బలయ్‌’ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సాహితీ, సాంస్కృతిక, సినిమా, రాజకీయ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుల ఉపన్యాసాలు.. జానపద, సంగీత, కళారూపాల ప్రదర్శనలు.. నోరూరించే తెలంగాణ వంటకాల మేళవింపుగా.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ దసరా సమ్మేళనం కొనసాగింది. గురువారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్‌–బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నీ తానై ముందుండి నడిపించారు. 


చిరంజీవితో ముచ్చటిస్తున్న గరికపాటి 

చిరంజీవి సినిమా తీయలేదా?: కేరళ గవర్నర్‌
రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా మనుషుల మధ్య స్నేహం, సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు అలయ్‌–బలయ్‌ ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యఅతిథి, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ అన్నారు. కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం జీవించడం గొప్ప అని పేర్కొన్నారు. ఇంత గొప్పగా ఉన్న దీనిని ఇతివృత్తంగా తీసుకుని సినీహీరో చిరంజీవి ఇంకా సినిమా తీయలేదా? అని ప్రశ్నించారు. 

భిన్న సంస్కృతులను ఏకం చేసేందుకే: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు సమైక్యంగా కృషి చేస్తే దేశంలోనే అగ్రగామిగా నిలుస్తాయని హరియా ణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. కేవలం శరీరాలే కాదు మనసులు ఆలింగనం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులను ఏకం చేయాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో ఎన్నికలప్పుడే రాజకీయాలుండేవని, ఆ తర్వాత ప్రాంతం, దేశాభివృద్ధి కోసం పాటు పడేవారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలు కలుసుకుని మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. అధర్మంపై సత్యం, ధర్మం గెలుపునకు చిహ్నంగా నిలిచే దసరా సందర్భంగా.. స్థానిక సంస్కృతికి చిహ్నంగా దీని నిర్వహణ అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా కొనియాడారు.


అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న చిరంజీవి 

దేశవ్యాప్తంగా జరగాలి: గాడ్‌ ఫాదర్‌’ సినిమా విడుదలతో హుషారుగా ఉన్న సినీ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్‌ –బలయ్‌ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలి.. వ్యాపించాలని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఈ సమ్మేళనం అద్భుతమని, స్నేహానికి, సుహృద్భావానికి ప్రతీకగా ఈ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. మాటలకు లొంగని వారు, హృదయ స్పందనలకు లొంగుతారని, అలాంటి ఈ సంస్కృతి మరింత ముందుకెళ్లాలన్నారు.

స్ఫూర్తిదాయకం గరికపాటి ప్రవచనం: గరికపా టి గారి ప్రవచనాలను తాను ఇష్టపడతానని, అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చిరంజీవి పేర్కొ న్నారు. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించానని, అయితే ఇన్నిరోజుల్లో ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. ‘మీ ఆశీస్సులతో ముందుకెళతాం. ఎప్పుడైనా సమయం దొరికి తే మా ఇంటికి రండి’ అంటూ ఆహ్వానించారు.

‘ఏపాటి వాడికైనా..’ అంటూ నాగబాబు ట్వీట్‌
ఫొటో సెషన్‌ ఆపాలంటూ చిరంజీవిని ఉద్దేశించి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందిస్తూ.. ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్‌ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’’.. అంటూ ట్వీట్‌ చేశారు.

చిరంజీవి ఫొటో సెషన్‌ ఆపకపోతే వెళ్లిపోతా: గరికపాటి
ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు ప్రసంగించేందుకు సిద్ధం కాగా, వేదికకు ఒకవైపు చిరంజీవితో కలిసి పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగుతుండడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో గరికపాటి.. ‘ఈ ఫొటో సెషన్‌ చిరంజీవి వెంటనే నిలిపేయాలి. వాళ్లు దానిని ఆపకపోతే నేను మాట్లాడకుండా వెళ్లిపోతా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

మరికొన్ని నిమిషాలు ఫొటోల కార్యక్రమం కొనసాగి ఆగిన తర్వాత గరికపాటి ప్రసంగించారు. మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీలు  డా.కె.లక్ష్మణ్, ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సత్యకుమార్, టి.ఆచారి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ హాజరయ్యారు.

వివిధ పార్టీల నేతలు మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, ప్రొ.ఎం.కోదండరాం, గిరీష్‌సంఘీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, డా.కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, కె.రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు రత్నప్రభ, విద్యాసాగర్, అజయ్‌ మిశ్రా, తదితరులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు