షార్‌... మాకు 90 ఎంఎల్‌ కావాలి.. డయల్‌ 100కు మందుబాబుల కాల్స్‌!

27 May, 2021 03:24 IST|Sakshi

‘డయల్‌ 100’కు ఫోన్లు చేసి సతాయిస్తున్న మందుబాబులు 

లాక్‌డౌన్‌ వేళ పెరుగుతున్న వివిధ ఫిర్యాదులు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ఈ కష్టకాలంలో కరోనా బాధితులు మందుల కోసం ఆరాటపడుతుంటే.. మద్యంప్రియులేమో మందు కోసం సతాయిస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళ.. ‘డయల్‌ 100’కు ఫోన్‌కాల్స్‌ పోటెత్తుతున్నాయి. ఇందులో లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కాల్స్‌ అధికంగా ఉంటున్నాయి. మరోవైపు మందుబాబుల కాల్స్‌ కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నాయి. ఎక్కడ మందు దొరుకుతుందో చెప్పాలంటూ ‘డయల్‌ 100’ సిబ్బందిని విసిగిస్తున్నారు.

ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉదయం 6– 10 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరిచే ఉంటున్నాయి. అయినా, పనీపాటాలేని కొందరు, తాగిన మద్యం సరిపోక మరికొందరు ‘డయల్‌ 100’కు ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ‘షార్‌... మాకు 90 ఎంఎల్‌ కావాలి. మందు ఎక్కడ దొరుకుతుంది? డబుల్‌ రేటైనా ఫర్లేదు’అని కొందరు, కనీసం బెల్ట్‌షాపుల అడ్రస్‌లైనా చెప్పాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌తో తమ విలువైన సమయం వృథా అవుతోందని ‘డయల్‌ 100’ఆపరేటర్లు వాపోతున్నారు. ఇలాంటి ఒక్కో కాల్‌ వల్ల దాదాపు 45 సెకండ్ల సమయం వృథా అవుతోందని, ఆలోపు ఆపదలో ఉన్నవారికి లైన్‌ దొరకకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అకారణంగా ఫోన్లు చేస్తే కేసులు పెడతామని సిబ్బంది హెచ్చరించారు. 

మొత్తం 54 వేల ఫిర్యాదులు
ఈ నెల 12 నుంచి 24 వరకు డయల్‌ 100 సిబ్బందికి మొత్తం 54 వేల ఫోన్‌ కాల్స్‌ రాగా... అందులో 6,431 కోవిడ్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనం గుమిగూడుతున్నారని 3,121, ఉదయం 10 గంటలు దాటినా షాపులు తెరిచే ఉన్నాయని 1,947, కోవిడ్‌ అనుమానితులపై 633, మాస్కు ధరించలేదని 308, కరోనా అనుమానిత మరణాలపై 144 కాల్స్‌ వచ్చాయి. ఆసుపత్రిలో బెడ్లు లేవని, అంబులెన్సులు కావాలని, ఆక్సిజన్‌ వెంటిలేటర్లు లేవని, చికిత్సకు ఆసుపత్రులవారు అధిక మొత్తం డిమాండ్‌ చేస్తున్నారని, ప్లాస్మా కావాలని పలు ఫోన్లు వచ్చాయి.

మరిన్ని వార్తలు