Hyderabad Numaish History: హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ సందడి.. నుమాయిష్‌ ప్రత్యేకతలివే!

2 Jan, 2023 18:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫతే మైదాన్, పరేడ్ గ్రౌండ్‌లాంటి చారిత్రకమైన మైదానాల జాబితాలోనిదే నాపంల్లిలోని 'ఎగ్జిబిషన్ గ్రౌండ్స్'. కొత్త సంవత్సరం వచ్చిందంటే భాగ్యనగరంలో 'హ్యాపీ న్యూ ఇయర్' కన్నా కూడా ఎక్కువగా వినబడే మాట 'నుమాయిష్'. అదే ప్రతి ఏటా జనవరి మొదటి తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు జరిగే ఆలిండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌).

చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల మీదుగా 6 ఏప్రిల్ 1938లో పబ్లిక్ గార్డెన్‌లో ఇది ప్రారంభమైంది. 'నుమాయిష్‌’గా పిలవబడే ఈ ఎగ్జిబిషన్‌ తొలి ఏడాదిలో 100 స్టాల్స్‌ నెలకొల్పగా.. కేవలం 10 రోజులు మాత్రమే నడిచింది.

►హైదరాబాద్ స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వినియోగదారులను చైతన్యపరచడానికి ఇలాంటి ప్రదర్శన ఒకటి అవసరమన్న ఆలోచన మొదట చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్.

►అందులో ముఖ్యలు మీర్ అక్బర్ అలీ ఖాన్ (మాజీ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ), నవాబ్ అహ్మదలీ ఖాన్ (మాజీ హోమ్ మినిస్టర్ ), మెహెది నవాజ్ జంగ్ (మాజీ గుజరాత్ గవర్నర్)లాంటి వారు.

►హైదరాబాద్ చరిత్రలో చాలా కీలకమైన 1946-47 కాలంలో నిజాం రాజుకు  దీవాన్‌గా (ప్రైమ్ మినిస్టర్) వ్యవహరించిన సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ నుమాయిష్‌కు పబ్లిక్ గార్డెన్ సరిపోదని దాన్ని ముఖరంజాహి రోడ్డులోని దాదాపు 23 ఎకరాల విశాలమైన ప్రస్తుతమున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్పించారు.

►అయితే 1947-48లో ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థాన విలీనం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ నిర్వహించలేక పోయారట. తిరిగి దీన్ని 1949లో ఆనాటి రాష్ట్ర గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి మళ్ళీ ప్రారంభించారు.

►కోవిడ్ విపత్తు వల్ల 81వ నుమాయిష్ 2022లో మొదలైనా కూడా కొనసాగించలేకపోవడం మనకు తెలిసిందే.

 ►ప్రస్తుత ఎగ్జిబిషన్ 2600కు పైగా దేశ విదేశాల స్టాల్స్‌తో చిత్ర విచిత్రమైన వస్తు వ్యాపారాలు, తినుభండారాలు, విజ్ఞాన వినోదాలు అన్ని వర్గాల వారికి అందిస్తూ ప్రతి రోజు దాదాపు 50 వేల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇందులో జరిగే హైదరాబాద్ సంస్కృతిలో ప్రధానమైన 'ముషాయిరా 'ఉర్దూ కవుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణ.

►'హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ' కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన లాభాపేక్ష లేని సంస్థ. దీనికి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి లేదా స్పీకర్ అధ్యక్షుడుగా ఉంటారు. ప్రస్తుతం మంత్రి హరీశ్ రావు ఆ స్థానంలో ఉన్నారు. దీని ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలు నిర్వహించబడటం విశేషం.

►ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న శంకర్ జీ.. ఫౌండర్ మెంబర్ హోదాలో చాలా కాలం ఈ సొసైటీకి సేవలు అందించారని ఇందులోని సమావేశ మందిరానికి 'శంకర్ జీ మెమోరియల్ హాల్ 'అని పేరు పెట్టారు. అయితే నాటి వ్యవస్థాపక సభ్యులను పూర్తిగా మరిచిపోవడం మాత్రం అన్యాయం.
-వేముల ప్రభాకర్.. డల్లాస్, అమెరికా

మరిన్ని వార్తలు