ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!

23 Aug, 2021 04:20 IST|Sakshi

వచ్చే మార్చి వరకు తుది గడువు విధించిన కేంద్రం

ప్రాజెక్టుల పురోగతిపై 31న సమీక్షించనున్న కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం, పూర్తి ఆయకట్టుకు నీరివ్వకపోవడం పై గుర్రుగా ఉన్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి 8 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, పనుల పురోగతిపై ఈ నెల 31న సమీక్ష 
నిర్వహించనుంది.  

8 ప్రాజెక్టులు.. 8 నెలలు... 
రాష్ట్రంలో ఏఐబీపీ కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులు 11 ఉండగా అందులో గొల్లవాగు, రాలివాగు, మత్తడి వాగు పనులు పూర్తయ్యాయి. సుద్దవాగు, పాలెంవాగు, జగన్నా«థ్‌పూర్, భీమా, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, కొమురం భీం ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులకు రూ.19,500 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.2వేల కోట్లు మేర నిధుల అవసరాలున్నాయి. ఇందులో కేంద్రం సాయం రూ.4,500 కోట్లకుగాను ఇంకా రూ.175 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్‌–2కి రూ.9 కోట్లు, దేవాదులకి రూ.145 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.6.50 కోట్లు, భీమాకు రూ.29 కోట్ల మేర నిధులు ఇవ్వాలి. ఈ నిధులను గత ఆర్థిక ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కేంద్రం నయాపైసా ఇవ్వలేదు.

ఈ ఏడాది ఆ నిధుల విడుదలకు సానుకూలంగా ఉంది. ఏఐబీపీ కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం వెనకాముందూ చేస్తోంది. దీనికి తోడు దేవాదుల పరిధిలోనే 2,400 ఎకరాలు, వరద కాల్వ కింద మరో 6వేల ఎకరాలు, ఎస్సారెస్పీ–2 కింద 700 ఎకరాలు మేర భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సేకరణను వేగవంతం చేసి పనులు ముగించి ఈ వానాకాలానికే 11 ప్రాజెక్టుల కింద నిర్ణయించిన 6.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేంద్రం ఆదేశించినా అది జరగలేదు.

4 లక్షల ఎకరాల్లో మాత్రమే నీరందించగలిగారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కేంద్రం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిధుల విడుదల చేసే అవకాశాలున్నాయి. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఈ నెల 31న రాష్ట్ర అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. పనుల పూర్తికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిధుల వ్యయం, అవరోధాలు తదితరాలపై సమగ్ర నివేదికలతో సిద్ధం కావాలని జల శక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏకే ఘా రాష్ట్రానికి లేఖ రాశారు.   

మరిన్ని వార్తలు