అదుపులోనే భైంసా 

9 Mar, 2021 02:51 IST|Sakshi

అల్లర్లపై హోంమంత్రి ఆరా

భైంసాలోనే సీపీ మకాం

డ్రోన్‌ల సహాయంతో పర్యవేక్షణ

గాయపడిన జర్నలిస్టులకు యశోద ఆస్పత్రిలో చికిత్స

భైంసా/ భైంసాటౌన్‌/ రాంగోపాల్‌పేట్‌: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం ఉదయానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. భైంసా అల్లర్ల సంఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తలెత్తిన వివాదంతో అల్లరిమూకలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రువ్వుకోవడం, కత్తులు, ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడడం వంటి సంఘటనల కారణంగా భైంసాలో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రామగుండం సీపీ సత్యనారాయణ, నిర్మల్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు వారియర్‌ భైంసా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వారు పట్టణంలోనే మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. సోమవారం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూకి భైంసా పట్టణాన్ని సందర్శించారు. ఘటనకు కారకులను పట్టుకుంటామని, పట్టణవాసులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని, కొంతమంది అల్లరిమూకల కారణంగా భైంసాలో ఇలాంటి వాతావరణం నెలకొనడం దురదృష్టకరమని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు.

144 సెక్షన్‌ అమలుతో భైంసా పట్టణం నిర్మానుష్యంగా కనిపించింది. బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలను మూసిఉంచారు. భైంసా పట్టణంలోకి పోలీసులు కొత్తవారిని అనుమతించలేదు. అల్లర్ల ఘటనకు సంబంధించి 28 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీల ఆధారంగా దోషులను గుర్తిస్తున్నామని ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు వారియర్‌ తెలిపారు. ఈ ఘటనలో 13 మందివరకు గాయాలపాలైనట్లు ఆయన చెప్పారు. ఏడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, అలాగే ఆరు ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, రెండు కార్లు, 16 దుకాణాలు కాలిపోయాయని రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనాలో గుర్తించారు. అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు.

గాయపడిన జర్నలిస్టులకు చికిత్స 
భైంసాలో ఆదివారం రాత్రి జరిగిన అల్లర్లలో గాయపడిన రాజ్‌ న్యూస్‌ రిపోర్టర్‌ విజయ్‌ (41), ఫొటో గ్రాఫర్‌ దేవేందర్‌రెడ్డి (27)లను సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. దేవేందర్‌రెడ్డి ముఖంపై తీవ్ర గాయాలున్నాయని, దవడ ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేశామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ విష్ణురెడ్డి తెలిపారు. తలలో ఏమైనా రక్తస్రావం జరిగిందా అనే విషయం తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇదే ఘటనలో కత్తిపోట్లకు గురైన విజయ్‌కు కడుపులో పలుచోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని మూడు రోజులు గడిస్తేనే వారి ఆరోగ్యంపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు యశోద ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో భైంసాలో జరిగిన అల్లర్లకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావని అన్నారు. ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేసేలా చూడాలన్నారు. కాగా, ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ దాడులు జరిగాయని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడులు జరిగాయని అన్నారు. కొందరు మతాన్ని అడ్డుపెట్టుకుని భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీజేపీ ఉన్నంత వరకు ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు.

పరిస్థితి అదుపులోనే ఉంది: హోంమంత్రి 
సాక్షి, హైదరాబాద్‌: భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే డీజీపీ, కలెక్టర్‌తోపాటు, జిల్లా ఎస్పీలతో మాట్లాడానన్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా సరిపడినన్ని బలగాలను మోహరించామని వెల్లడించారు. భైంసా పట్టణంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సోమవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు సమాధానమిచ్చారు. అంతకుముందు భైంసాలో చెలరేగిన హింసను నివారించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కేటీఆర్‌ ట్విట్టర్‌లో కోరిన నేపథ్యంలో మహమూద్‌ అలీ స్పందించారు.  

మరిన్ని వార్తలు