సెట్‌లన్నీ  వాయిదాయేనా? 

17 May, 2021 04:01 IST|Sakshi

జేఈఈ మెయిన్‌ వాయిదాతో అడ్వాన్స్‌డ్‌ కూడా వాయిదా పడే అవకాశం 

అన్నీ అనుకూలిస్తే జూలైలో జేఈఈ మెయిన్‌ మిగతా పరీక్షలు 

రాష్ట్ర ప్రవేశ పరీక్షలపైనా జాతీయ పరీక్షల వాయిదా ప్రభావం 

జూన్, జూలైలో జరగాల్సిన సెట్‌లు వాయిదా పడే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరికలకు నిర్వహించాల్సిన  ప్రవేశ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్, జూలైలో ఈ పరీక్షలనిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ఏప్రిల్, మే నెలల పరీక్షలు వాయిదా పడగా, వాటి ప్రభావం రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షలైన (సెట్స్‌) ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలపైనా పడే పరిస్థితి నెలకొంది. 

జేఈఈ మెయిన్‌ వాయిదా.. 
ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండు వాయిదా పడ్డాయి. 2021–22 విద్యా సంవత్సరం కోసం జేఈఈ మెయిన్‌ను కరోనా కారణంగా నాలుగు దఫాలుగా నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గత డిసెంబర్‌లోనే ప్రకటించింది. అందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి, రెండో దఫా పరీక్షలను నిర్వహించింది. ఇక ఏప్రిల్‌ 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సి మూడో దఫా పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ప్రకటించింది.

ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన నాలుగో విడత పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. మళ్లీ ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది విద్యార్థులకు 15 రోజుల ముందుగా తెలియజేస్తామని ప్రకటించింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడితేనే జూన్‌లో (వచ్చే నెలలో) ఆ రెండు జేఈఈ మెయిన్‌లను నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే జూలైలో నిర్వహించాల్సి వస్తుంది. అదే జరిగితే ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కూడా వాయిదా వేయకతప్పదని అధికారులు పేర్కొంటున్నాయి. 

రాష్ట్ర పరీక్షలూ వాయిదా? 
జాతీయ స్థాయి పరీక్షల ప్రభావం రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలపైనా పడనుండటంతో అవి కూడా వాయిదా పడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోతే జూన్‌ 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్‌ను వాయిదా వేయాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జూలై 1వ తేదీన నిర్వహించాల్సిన ఈసెట్, జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎంసెట్‌ కూడా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జేఈఈ మెయిన్‌ను జూలైలో నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు జూలై 5వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎంసెట్‌ నిర్వహణలో ఆలస్యం తప్పేలా లేదు.

ఇక ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌ పరీక్షలు ఆగస్టులో ఉన్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కరోనా కేసులు ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటి వారంనాటికైనా తగ్గుముఖం పట్టి, పరిస్థితి అదుపులోకి వస్తే మాత్రం పరీక్షలను యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించే     వీలు ఉంటుందని, అయితే అది సాధ్యం అవుతుందో లేదోనన్న అనుమానాలు ఉన్నాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ వాయిదా 
తెలంగాణ గురుకులాల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను వాయిదా వేసినట్లు గురుకులాల సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17వ తేదీతో ముగియనున్న దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 31వ తేదీ వరకు పొడగించనున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత తెలియజేస్తామని పేర్కొంది.   

మరిన్ని వార్తలు