సాంకేతిక విద్యకు చికిత్స అవసరం

9 Apr, 2022 02:14 IST|Sakshi
మోహన్‌ రెడ్డికి మెమొంటోను అందజేస్తున్న ప్రొ. కట్టా నర్సింహారెడ్డి. చిత్రంలో లింబాద్రి 

అఖిల భారత వైస్‌ చాన్స్‌లర్ల సదస్సులో వక్తలు

ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత లోపించిందనే అభిప్రాయం

ఏటా 21 లక్షలమంది పట్టాలతో బయటకి, వారిలో 15.3 శాతం మందికే నైపుణ్యం

2026 నాటికి దేశంలో ఉపాధి అవకాశాలు 75 లక్షలు.. ఈస్థాయిలో నిపుణులు లభించడం కష్టం

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతికవిద్యలో గుణాత్మక మార్పు అవసరమని అఖిల భారత ఉప కులప తుల సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. మార్కె ట్‌ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యా ర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలను వెతుక్కునేవాళ్లు కాదని, వ్యవస్థను మార్చేవాళ్లు కావాలని ఆకాంక్షిం చారు. శుక్రవారం ఇక్కడ హైదరాబాద్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ‘ఆఫరింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌’అనే అంశంపై అఖిల భారత విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది.

కార్యక్రమంలో సియంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భారత పారిశ్రామిక అవసరాలకు తగ్గరీతిలో నిపుణులు కన్పించడం లేదని, ఏటా 21 లక్షలమంది ఇంజ నీర్లు పట్టాలతో వర్సిటీల నుంచి బయటకొస్తున్నా, వారిలో కేవలం 15.3 శాతం మందికే నేటి అవసరా లకు తగ్గ నైపుణ్యం ఉంటోందని అన్నారు. 2026 నాటికి దేశంలో సాంకేతిక ఉపాధి అవకాశాలు దాదాపు 75 లక్షలకు చేరే వీలుందని, కానీ, ఈ స్థాయిలో నిపుణులు లభించడం కష్టమనే అభిప్రా యం వ్యక్తం చేశారు.

స్వయంసమృద్ధిని కోరుకుం టున్న భారత్‌లో ఇంజనీరింగ్‌ విద్యస్థాయి నుంచే స్టార్టప్స్‌ను, ఇంక్యుబేటర్స్‌ను తయారు చేయాలని, ఈ గురుతర బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసు కోవాలని సూచించారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసి కూడా చిన్నపాటి గ్రామస్థాయి ఉపాధి కోసం వెంపర్లాడటం దురదృష్టకరమన్నారు. గత కొన్నాళ్ళుగా ఉన్నతవిద్యలో, మహిళల భాగస్వా మ్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సిం హారెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా సాంకేతికవిద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదు స్టార్టప్స్‌
ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదుగురు స్టార్టప్స్‌ను తయారు చేయగలిగితే దేశ జీడీపీలోనే ఉజ్వలమార్పు కన్పిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బీజే రావు అన్నారు. నోబెల్‌ ప్రైజ్‌ గెలుచుకున్న వాళ్లల్లో అనేక మంది గ్రాడ్యుయేట్‌ స్థాయి వాళ్లే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ డి.రవీంద్ర, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్, ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు