జూనియర్‌ కాలేజీలకు ‘ఫైర్‌’!

30 Aug, 2020 03:19 IST|Sakshi

అనుబంధ గుర్తింపునకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌ఓసీ తప్పనిసరి

15మీటర్ల ఎత్తు నిబంధనతో వీటికి ఎన్‌ఓసీ జారీ అసాధ్యం 

దీంతో ఈ ఏడాదిలో గుర్తింపునకు నోచుకోని 50 శాతం కాలేజీలు 

ఫలితంగా 1 నుంచి సెకండియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు కష్టమే 

అదేవిధంగా ఫస్టియర్‌ అడ్మిషన్లకూ తీవ్ర ఇబ్బందులే.. 

తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తు ఆగమే..

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ‘అగ్గి’రాజుకుంది. యాజమాన్యాలకు సెగ తగిలింది. ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి జారీ చేసే కాలేజీ అనుబంధ గుర్తింపునకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్‌ఓసీ) సమర్పించాలనే నిబంధన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు 15 మీటర్ల ఎత్తు వరకున్న భవనాలకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌ఓసీ అవసరం లేదు. తాజాగా సవరించిన నిబంధన ప్రకారం ఆరు మీటర్లు మించి ఎత్తున్న భవనంలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే ఫైర్‌ ఎన్‌ఓసీ తప్పకుండా సమర్పించాలి. రాష్ట్రంలో 2, 472 ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. వీటిలో 404 ప్రభుత్వ కాలేజీలు కాగా... మరో మూడువందల వరకు గురుకుల, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. తాజా నిబంధన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1, 450 కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలు సమర్పించాలి. ప్రస్తుతం ఈ కాలేజీలున్న భవనం తీరు, సెట్‌బ్యాక్‌ స్థితి ఆధారంగా ఫైర్‌ ఎన్‌ఓసీ వచ్చేది కష్టమే అని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వీటికి 2020–21 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లభించడం అసాధ్యమే. హఠాత్తుగా అమల్లోకి తెచ్చిన ఫైర్‌ ఎన్‌ఓసీపై ఆయా యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

గుర్తింపు రాకుంటే ఎలా...? 
రెండ్రోజుల్లో ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము చదివే కాలేజీకి గుర్తింపు ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కరోనా వైరస్‌తో విద్యాసంవత్సరం తీవ్ర గందరగోళంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జూనియర్‌ కాలేజీలు గుర్తింపునకు నోచుకోకుంటే ఇంటర్‌ విద్యపై తీవ్ర ప్రభావం పడనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించేందుకు యాజమాన్యాలు సిద్ధమవ్వగా... టీశాట్‌ ద్వారా వీడియో పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఫస్టియర్‌ అడ్మిషన్లు ఎలా... 
ఇంటర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకావొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5.3 లక్షల మంది ఇటీవల పదోతరగతి పాసయ్యారు. ఓపెన్‌ టెన్త్‌ ద్వారా మరో 70 వేల మంది ఇంటర్‌ ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రంలోని కాలేజీలన్నీ పూర్తిస్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటేనే ఆరు లక్షల మంది ఇంటర్‌లో ప్రవేశిస్తారు. అలా కాకుండా సగం కాలేజీలకు అనుమతి ఇవ్వకుంటే దాదాపు 3 లక్షల మందికి ఇంటర్‌లో చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఫైర్‌ ఎన్‌ఓసీ నిబంధనపై ప్రభుత్వం త్వరితంగా నిర్ణయం తీసుకుంటే తప్ప గందరగోళానికి తెరపడదు. ‘గతంలో ఉన్న నిబంధన ప్రకారం 15 మీటర్ల వరకు ఎన్‌ఓసీ ఆవశ్యకత లేకుండా అనుబంధ గుర్తింపు ఇవ్వాలి ’అని ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరిసతీశ్‌ ‘సాక్షి’తో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు