ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓరుగల్లులో పోటాపోటీ ప్రయత్నం

28 Sep, 2020 10:09 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికలపై దృష్టి సారించిన ప్రధాన రాజకీయ పార్టీలు ఓరుగల్లు వేదికగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఎజెండాలను తెరమీదకు తెస్తున్నాయి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం 2021 మార్చి 29న ఖాళీ కానుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైన ఎన్నికల కమిషన్‌.. ఓటరు జాబితాను సిద్ధం చేసే క్రమంలో ఓటరు నమోదుకు అక్టోబర్‌ 1న  నోటీసు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ నాయకులను, క్యాడర్‌ను సన్నద్ధం చేస్తున్నాయి. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల గెలుపు వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. 

ముందంజలో టీఆర్‌ఎస్‌.. 
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంలో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ 15 రోజుల క్రితమే హైదరాబాద్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు బాధ్యతలను అప్పగిస్తూ సీనియర్‌ నేతలను ఇన్‌చార్జ్‌లుగా శనివారం సాయంత్రం ప్రకటించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థి ఎవరనేది తేలకపోయినా అంతా సిద్ధం చేశారు.

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్‌ నుంచి ఆరుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శనలు, పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసింది. భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు సీనియర్లు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం. ఇప్పుడే ఆ పేర్లను వెల్లడించలేమని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వరంగల్‌లో వేగం పెంచింది. ఇటీవల నిర్వహించిన కలెక్టరేట్‌ల ముట్టడి కూడా ఉద్రిక్తంగా మారింది. 

పార్టీల సమాయత్తం..
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఓరుగల్లులో అడ్డా వేస్తున్నాయి. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 6 వరకు ఓటరు నమోదు ప్రక్రియ ఉండనున్నందున పట్టభద్రులను పెద్ద మొత్తంలో ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి సారించాయి. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఇప్పటికే రెండు పర్యాయాలు వరంగల్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన ఆయన, ఓటరు నమోదుపై దృష్టి సారించాలని సూచించారు.

యువత తెలంగాణ పార్టీ రాణి రుద్రమను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు తదితర కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ హన్మకొండలో ఆదివారం ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అవలంభించే విధానాలపై పలు సూచనలు చేశారు. సీపీఐ, సీపీఎం సైతం మండలి ఎన్ని కల్లో కీలకంగా వ్యవహరించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. మొత్తంగా పార్టీల సమాయత్తంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మల్సీ ఎన్నికల సందడి మొదలైంది.  

>
మరిన్ని వార్తలు