ఇక.. మును‘దౌడ్‌’.. మునుగోడులో వేడి మొదలైంది!

4 Oct, 2022 00:53 IST|Sakshi

సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ 

క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారానికి ఏర్పాట్లు 

అనుకూలతలు, ప్రతికూలతలపై అంచనాలు 

ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో వ్యూహాలు 

సాక్షి, హైదరాబాద్‌:  ఉప ఎన్నికకు నగారా మోగడంతో మునుగోడులో వేడి మొదలైంది. మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒక్కసారిగా హడావుడి పెరిగింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. దూకుడు మరింతగా పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ మరోమారు కేసీఆర్‌ సభ నిర్వహణకు ప్లాన్‌ చేసుకుంటోంది. బీజేపీ కూడా అమిత్‌షాతో బహిరంగ సభ నిర్వహించగా.. మరోమారు పార్టీ జాతీయ నేతలతో భారీ సభ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అటు కాంగ్రెస్‌ ‘మునుగోడు’ కోసం రాహుల్‌ గాంధీతో శంషాబాద్‌లో సభ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

మూడు పార్టీలూ మండలాలు, గ్రామాల వారీగా నియమించుకున్న ఇన్‌చార్జులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించాయి. కొంతకాలం నుంచి దూకుడు మీద ఉండటం, సిట్టింగ్‌ అభ్యర్థి కావడం సానుకూలమని బీజేపీ భావిస్తుండగా.. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, సీఎం కేసీఆర్‌ వ్యూహాలు టీఆర్‌ఎస్‌కు బలంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తమ కేడర్‌ మీద ఆశలు పెట్టుకుంది. అయితే మునుగోడు ప్రచారం, ఉప ఎన్నిక సమయంలోనే రాష్ట్రంలో రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుండటం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అయితే రాహుల్‌ యాత్ర వల్ల కాంగ్రెస్‌కు ప్రచారం, ప్రయోజనం రెండూ ఉంటా యన్న భావన వ్యక్తమవుతోంది. ఇక ఇప్పటివరకు కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వం మాత్రమే ఖరారైంది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాల ప్రకటన లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీఎస్పీ పోటీ ఆలోచన చేస్తోంది. ఆ పార్టీ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మునుగోడులో ప్రచారం చేస్తున్నారు కూడా.  

నవంబర్‌ 3న పోలింగ్‌
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నగారా మోగింది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనుండగా అదే నెల 6న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. మునుగోడు సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే సంబంధిత అసెంబ్లీ నియోజక వర్గాల పరిధి కలిగి ఉన్న జిల్లా/జిల్లాల్లో పూర్తిస్థాయి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఈసీ వెల్లడించింది.

మునుగోడు అసెంబ్లీ స్థానం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో ఉండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుంది. 2022 జనవరి ఒకటి అర్హత తేదీగా ప్రకటించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కోసం వినియోగించనున్నారు. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరినప్పటికీ ఆయన్ను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఆ పార్టీ అధిష్టనం ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ఇంకా అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. (క్లిక్ చేయండి: రెండు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు.. మూడోసారి విజయం ఎటువైపో..)

మరిన్ని వార్తలు