GHMC Mayor: హాట్‌ డే.. కౌన్‌ బనేగా మేయర్

11 Feb, 2021 08:08 IST|Sakshi

ఓ ఎన్నిక.. అన్నింటా కాక

ఏ నిమిషానికి ఏమి జరుగునో! 

సీల్డ్‌ కవర్‌లో పేర్లు పంపిస్తామన్న సీఎం

సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌లు ఎవరన్నది ఇంకా తేటతెల్లం కాలేదు. నిర్ణీత సమయంలోగా నేరుగా సీల్డ్‌ కవర్‌లో పేర్లు పంపిస్తామని స్వయానా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆ పేరు ఎవరివి అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. గురువారం మేయర్‌ ఎన్నిక జరుగుతుందా.. లేదా..? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎన్నిక సమయానికి సీల్డ్‌ కవర్‌లో పంపుతామన్నప్పటికీ, పేరే రాకుండా ఎన్నిక సమావేశానికి హాజరు కావద్దనే సంకేతాలందితే..? అన్న చర్చ సైతం జరుగుతోంది. బహిరంగంగా అంగీకరించకపోయినా.. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు సఖ్యతతోనే వ్యవహరిస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలూ హాజరు కాకపోతే మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరగదు. జీహెచ్‌ఎంసీ నిబంధనలు.. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికల విధివిధానాల మేరకు మర్నాటికి వాయిదా పడుతుంది. శుక్రవారం సైతం కోరం లేకుంటే, విషయాన్ని వివరిస్తూ, ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అప్పుడిక ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలు ఏ తేదీన నిర్వహించాలో ప్రకటిస్తుంది. ఎంత వ్యవధిలోగా ఎన్నిక నిర్వహించాలో మాత్రం నిబంధనల్లో లేదు. అంటే అది రోజులా.. అంతకుమించి నెలలకు వెళ్తుందా అన్న విషయంలో స్పష్టతలేదు.

  • రోజుల వ్యవధిలోనే ఎన్నికల సంఘం తేదీ ప్రకటిస్తుందని చెబుతున్నా పరోక్షంగా టీఆర్‌ఎస్‌ అభీష్టం మేరకే ఎన్నికల తేదీ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
  • నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక చూసుకోవచ్చులే అనుకుంటే,  ఎక్కువ కాలం వాయిదా పడటానికి కూడా అవకాశం ఉంటుదంటున్నారు.  
  • రెండో రోజూ వాయిదా పడినా.. ఎక్కువ సమయం తీసుకోకుండానే ఎన్నికల సంఘం తేదీని వెలువరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అప్పుడు కోరంతో సంబంధం లేకుండా ఎంతమంది హాజరైతే, వారి ఓట్లలోనే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు. 

మేయర్‌ గౌను.. గుర్తుకొచ్చేను! 
మేయర్‌ అనగానే ప్రత్యేకంగా ధరించే గౌను గుర్తుకొస్తుంది. ఆ గౌను మనకు ఇంగ్లండ్‌ నుంచి పరిచయమైంది. గతంలో రాజభోగాలనుభవించిన మేయర్లు కాలక్రమేణా కార్పొరేషన్లకు పరిమితమయ్యారు. రోమన్‌ మహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు తమ ఎస్టేట్‌ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు మేజర్‌ డోమస్‌ (మేయర్‌)లను నియమించేవారు. క్రీ.శ 6– 8 శతాబ్దాల్లో ఐరోపా దేశాలను పాలించిన మెరొవింజియన్‌ మహారాజులు కూడా మేయర్‌లను నియమించారు. వారిని ప్యాలెస్‌ మేయర్‌లనేవారు. ఆ తర్వాత వివిధ అధికారాలు చలాయించిన మేయర్లు, క్రమేణా మున్సిపల్‌ కార్పొరేషన్లకు పరిమితమయ్యారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాక ఫ్రాన్స్‌వంటి కొన్ని దేశాల్లో ఐరోపాలో మేయర్‌లకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిటిష్‌వారు ఇండియాను పాలించడంతో మనకూ వారిలా గౌను.. మేయర్‌ పదవికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత పాలకమండళ్లలో కౌన్సిల్‌ సమావేశాల్లో తప్పనిసరిగా ధరించేవారు. దేశ, విదేశీ ప్రతినిధులకు విమానాశ్రయాల్లో స్వాగతం పలికేందుకు గౌను ధరించే వెళ్లేవారు. బొంతు రామ్మోహన్‌ మాత్రం ఆ సంప్రదాయానికి మినహాయింపునిచ్చారు. సాధారణ దుస్తుల్లోనే కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారు వచ్చినప్పుడు తప్ప మిగతా వారికి స్వాగతం పలికేందుకు సివిల్‌ డ్రెస్‌లోనే వెళ్లారు. 

మరిన్ని వార్తలు