కేసీఆర్ @ సాగర్‌ ఫినిషింగ్‌ టచ్‌

14 Apr, 2021 02:52 IST|Sakshi

నేడు సాగర్‌లో ప్రచారానికి గులాబీ బాస్‌

హాలియాలో భారీ సభలో ప్రసంగించనున్న సీఎం

రేపటితో ముగియనున్న ఉప ఎన్నికల ప్రచారం

ముఖ్యమంత్రి సభతో టీఆర్‌ఎస్‌కు మరింత ఊపు

భారీ మెజారిటీతో విపక్షాలపై విజయమే లక్ష్యం

జన సమీకరణలో ఎన్నికల ఇన్‌చార్జీల తలమునకలు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. 17వ తేదీన పోలింగ్‌ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రచార పర్వం ముగియనుంది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. హాలియా పట్టణ శివారులోని పెద్దవూర మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ యంత్రాంగం భారీయెత్తున ఏర్పాట్లతో పాటు జన సమీకరణకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

కోవిడ్‌ నిబంధనలతో..
సుమారు లక్ష మంది హాజరవుతారనే అంచనా నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. సభకు తరలివచ్చే వారు మాస్కులు ధరించడంతో పాటు, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు సభ ఏర్పాట్లలో క్రియాశీలంగా పనిచేస్తున్న నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. 20 ఎకరాల స్థలంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 30 ఎకరాలను పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

విజయ దుందుభే లక్ష్యంగా.. 
కోవిడ్‌ పరిస్థితుల్లో సభ నిర్వహణపై చివరి నిమిషం వరకు సందిగ్ధత కొనసాగినప్పటికీ.. జన సమీకరణపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్ల రవీందర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలను సమన్వయం చేస్తున్నారు. సాగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఇన్‌చార్జీలుగా మున్సిపాలిటీలు, మండలాల్లో ప్రచార, సమన్వయ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్యేలకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు కూడా జన సమీకరణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో కంగుతిన్న టీఆర్‌ఎస్‌ గత నెలలో జరిగిన శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు స్థానాలను కైవసం చేసుకుంది. అదే ఊపులో సాగర్‌లో కూడా విజయదుందుభి మోగించాలనే పట్టుదలతో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 46.34 శాతం ఓట్లు సాధించిన టీఆర్‌ఎస్‌ ఈసారి 55 శాతానికి చేరువలో ఓట్లు సాధించే దిశగా లెక్కలు వేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధించడం, బీజేపీకి డిపాజిట్‌ దక్కకుండా చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలకు కళ్లెం వేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

రెండు నెలలుగా ముమ్మర ప్రచారం
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ ఒక్కసారి గెలిచింది. 2014 ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేసిన నోముల నర్సింహయ్య ఓటమి పాలుకాగా, ఆ తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. అయితే ఆయన హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తమ సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నోముల కుమారుడు భగత్‌ను బరిలోకి దించింది. నామినేషన్ల దాఖలు గడువుకు కేవలం రెండురోజుల ముందు మాత్రమే అభ్యర్థిని ప్రకటించినా.. అంతకు ముందు రెండు నెలల నుంచే టీఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన నేతలంతా పార్టీ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

అభివృద్ధి మంత్రం
కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి లక్ష్యంగానే టీఆర్‌ఎస్‌ ఇన్ని రోజులపాటు ప్రచారం చేసింది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదంటూ .. ఏడున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గానికి ఏమేం చేశామో వివరించింది. సాగునీటి రంగంతోపాటు.. మౌలిక వసతుల కల్పన, వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజలకు ఎలా అండగా నిలిచిందీ సీఎం సభ ద్వారా మరోమారు నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేయనున్నారని చెబుతున్నారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు రైతులు కావడంతో.. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాల గురించి సీఎం విస్తృతంగా వివరించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలకు దీటైన కౌంటర్‌ ఇస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే సీఎం కేసీఆర్‌ ఓ మారు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు , ముఖ్యంగా సాగునీటి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. హాలియా మండల పరిధిలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి వరాలు ప్రకటించి వెళ్లారు.

  

మరిన్ని వార్తలు