రామయ్య పెళ్లికి ముస్తాబు 

10 Apr, 2022 02:56 IST|Sakshi
ఎదుర్కోలు ఉత్సవంలో సీతమ్మ తల్లితో అర్చకులు  

భద్రగిరికి ఉత్సవ శోభ 

వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం 

నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న ఇంద్రకరణ్‌రెడ్డి

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్‌ లగ్న సుముహూర్తమున పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రుల తిరు కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణ వేడుక శాస్త్రోక్తంగా జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో సీతారాములవారి శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా జరుపుతా రు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకల సందర్భంగా రామాలయం విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సీతమ్మవారి తరఫున కొందరు, రామయ్య వారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి ‘మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పదంటూ’వేడుకను రక్తి కట్టించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు 
సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ము త్యాల తలంబ్రాలు సమర్పించడం తానీషా కాలం నుంచి వస్తున్న సం ప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ ముత్యాల తలం బ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. వరుసగా ఆరోసారి ఆయన గైర్హాజరవుతున్నారు. దీంతో సర్కారు తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

మరిన్ని వార్తలు