అతి(ర)థులోస్తున్నారు! స్టార్‌ హోటళ్లలో నో రూమ్స్‌ బోర్డ్‌లు

24 Jun, 2022 07:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి స్టార్‌ హోటళ్లన్నీ నో రూమ్స్‌ బోర్డ్‌లు పెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకానున్నారు. వీరంతా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. దీంతో నగరంలోని స్టార్‌ హోటల్స్‌ అన్నీ ముందస్తు బుకింగ్స్‌ అయిపోయాయి. 

అన్ని స్టార్‌ హోటళ్లలో బుకింగులు.. 
కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల కోసం నగరంలోని హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ వంటి 48–50 స్టార్‌ హోటల్స్‌ బుకింగ్‌ చేసినట్లు తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నాగరాజు తెలిపారు. స్థానిక, ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు, చిన్న లీడర్ల కోసం ఓయో గదులు, గెస్ట్‌ హౌస్‌లను బుకింగ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఒకటే గదులు ఇద్దరు ముగ్గురు వసతికి వీలుంటుందనే ఉద్దేశంతో వీటిని బుకింగ్‌ చేసినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ ఎగ్జిక్యూటివ్, సుపీరియర్, డీలక్స్, ప్రీమియర్‌ గదులన్నీ బుకింగ్‌ చేసేశారని ఆ స్టార్‌ హోటల్‌ ప్రతినిధి తెలిపారు. ప్రతినిధుల కోసం వంటకాలు, ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేసినట్లు సమాచారం. 

పోలీసుల సమీక్ష... 
జులై 2, 3 తేదీల్లో గచ్చిబౌలిలోని హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అలాగే బీజేపీలోని కీలక నేతలు నోవాటెల్‌ హోటల్‌లో బస చేయనున్నారు. దీంతో హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ హోటల్‌ యాజమాన్యంతో సోమవారం సైబరాబాద్‌ పోలీసులు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా హోటల్స్‌లోని బుకింగ్స్‌ వివరాలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌తో పాటు కేంద్ర మంత్రులు బస చేయనున్న ఆయా హోటల్స్‌ భద్రతా ఏర్పాట్లపై పోలీసులు బ్లూ ప్రింట్‌ తయారు చేస్తున్నారు.  

(చదవండి: ప్రధాని బస ఎక్కడా?)

మరిన్ని వార్తలు