ప్రశ్నపత్రాల లీకేజీ: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్‌?

19 Mar, 2023 15:29 IST|Sakshi

ఇంతకుముందే పలు పేపర్ల తేదీలు ప్రకటించిన కమిషన్‌ 

రద్దు కారణంగా ఆరు పరీక్షలను తిరిగి నిర్వహించాల్సిన పరిస్థితి 

కొత్త ప్రశ్నపత్రాల తయారీకి కసరత్తు మొదలుపెట్టిన అధికారులు 

రూపకల్పన, వివిధ దశల్లో ఆమోదానికే 2 నెలల సమయం 

ఈ క్రమంలో దాదాపు అన్ని నోటిఫికేషన్ల షెడ్యూల్‌లో మార్పులు 

గ్రూప్‌–1 మెయిన్స్‌ అనివార్యంగా వాయిదా

గ్రూప్‌–2, గ్రూప్‌–4 పరీక్షల తేదీలూ మారే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్‌.. మరో రెండు పరీక్షలను  ని­ర్వహించకుండానే వాయిదా వేసింది.

వీటితోపా­టు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కొత్తగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటన్నింటి క్రమంలో ఇప్పటికే నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగ అర్హత పరీక్షల నిర్వ­హణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని.. కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీనిపై టీఎస్‌పీఎస్సీ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని  అంటున్నాయి. 

కొత్త ప్రశ్నపత్రాల రూపకల్పన కోసం.. 
టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీతోపాటు ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌.. 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను వాయిదా వేసింది.

ఈ ఆరు పరీక్షలను తిరిగి నిర్వహించాలి. మరో తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. లీకేజీ, రద్దు, వాయిదాల క్రమంలో ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, అందులో ఇప్పటికే రూపొందించిన ప్రశ్నపత్రాలతో సంబంధం లేకుండా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వంటి కార్యాచరణ అవసరం.

ఇదంతా పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దయిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే.. ఇప్పటికే నిర్దేశించిన ఇతర పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి రానుంది. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావించినా.. రద్దయిన, వాయిదా పడిన పరీక్షలకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూళ్లలో మార్పులు చేసి.. కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

గ్రూప్‌–1 మెయిన్స్‌కు తప్పని వాయిదా! 
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఈ ఏడాది జూన్‌ 11న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన తర్వాత మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి.. మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన గ్రూప్‌–1 మెయిన్స్‌ తేదీలు దాదాపు రద్దయినట్లేనని అధికారులు చెప్తున్నారు. ప్రిలిమ్స్‌ ఫలితాల తర్వాత మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల అవుతుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు