ఆ ఉద్యోగ పరీక్షలు.. ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి

19 Jul, 2021 03:10 IST|Sakshi

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ 

ఇంగ్లిష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తే ఇబ్బందులు 

హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర నష్టం 

12 భాషల్లో నిర్వహించాలన్న కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు ఆదివారం లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు, శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు నిర్వహించే పోటీపరీక్షలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలవారు పోటీపడతారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఆ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని.. దీనివల్ల ఆంగ్లేతర మాధ్యమంలో చదివినవారు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. 

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం అమలు చేయండి 
జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసి.. జాతీయ పోటీ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ లేఖలో గుర్తు చేశారు. కానీ అమల్లో తాత్సారం జరుగుతోందన్నారు. తాజాగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుళ్ల నియామకాలు, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్‌మెన్‌ ఎగ్జామినేషన్‌ తదితర నోటిఫికేషన్లలో కేవలం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రాంతీయ భాషల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. కేంద్ర ప్రభుత్వ, అనుబంధ శాఖలు, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌బీఐ, పీఎస్‌బీ, యూపీఎస్‌సీ వంటి పరీక్షలను ప్రాంతీయ భాషల్లో సైతం నిర్వహించాలని కోరారు. ప్రస్తుత నోటిఫికేషన్లను నిలిపేసి.. అన్ని భాషల్లో పరీక్షలు నిర్వహించేలా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.   

మరిన్ని వార్తలు