ఆవిష్కరణలే లక్ష్యంగా స్కూళ్లలో ప్రత్యామ్నాయ బోధన

24 Feb, 2021 04:44 IST|Sakshi

15 ఎకరాల్లో ఇన్నోవేషన్‌ ల్యాబ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

తొలి విడతలో 4 జిల్లాల్లో శిక్షణ

అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌తో టీఎస్‌ఐసీ ఒప్పందం

వచ్చే మూడేళ్లలో పూర్తిగా అమలు 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల స్థాయిలో నిరంతరం మారుతున్న బోధన పద్ధతులతో పాఠ్యాంశాల్లో విద్యార్థులను విలీనం చేయడం ద్వారా సృజనాత్మకతకు మరింత పదును పెట్టే అవకాశం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో నవమ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడానికి అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నవమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడిచే ఇన్నోవేషన్‌ ల్యాబ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (ఐఎల్‌సీఈ) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సె ల్‌ (టీఎస్‌ఐసీ)తో మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా జయేశ్‌ మాట్లాడారు.

క్షేత్రస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జయేశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎల్‌సీఈ ఏర్పాటు కోసం టీఎస్‌ఐసీ, నవమ్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యం రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు బాటలు వేస్తుందని టీఎస్‌ఐసీ సీనియర్‌ సలహాదారు వివేక్‌ వర్మ తెలిపారు. ప్రవాహ, టీఎస్‌ఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు లో తాము భాగస్వాములు కావడం పట్ల అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ రామ్జీ రాఘవ న్‌ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక, ఆవిష్కరణల వాతావరణంలో క్షేత్రస్థాయి నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ సాధించే ఫలితాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రవాహ ఫౌండేషన్‌ చైర్మన్‌ రవి కైలాస్‌ చెప్పారు. 

15 ఎకరాల్లో ఐఎల్‌సీఈ ఏర్పాటు.. 
రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా టీఎస్‌ఐసీ ముందడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటయ్యే ‘నవమ్‌ ప్రాంగణం’లో ఇన్నోవేషన్‌ ల్యాబ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్‌ సంయుక్తంగా వచ్చే పదేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 11 నుంచి 18 ఏళ్ల వయసు లోపు విద్యార్థులు, 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం ఐఎల్‌సీఈ ద్వారా అందుతుంది. ఈ క్యాంపస్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీ సైన్స్‌ సెంటర్లు, డోర్‌ టు డోర్‌ సైన్స్‌ ల్యాబ్‌లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి వనరులను అందుబాటులోకి తెస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనుకునే యువతకు ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లను కూడా అందజేస్తుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు