ఆంగ్లంలో అనర్గళంగా..

23 Nov, 2020 08:12 IST|Sakshi

ఇంగ్లిష్‌ను ఇట్టే పట్టేస్తుంది.. 

 ఆంగ్ల పరిజ్ఞానంలో అద్భుత ప్రతిభ

ఏడో తరగతి చదువుతూ ఆపై తరగతుల వారికి బోధన

కూసుమంచి: ఆంగ్లం (ఇంగ్లిష్‌‌) సబ్జెక్టు అంటే విద్యార్థులకు ఓ పక్క భయం, ఆందోళన. కానీ, ఈ చిన్నారి నిషిత ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం, వ్యాకరణంపై ఎంతోపట్టు కలిగి ఉండటం, తనపై తరగతుల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు సైతం వ్యాకరణాన్ని సుులభతర పద్ధతుల్లో ఎలా నేర్చుకోవచ్చో వివరిస్తున్న తీరు ను చూసి అందరూ ఔరా అనాలి్సందే. పిట్ట కొంచెం కూత ఘనం అనే దానికి నిర్వచనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జుజ్జుల్‌రావుపేట గ్రామానికి చెందిన దాసు భాస్కర్, పద్మజ దంపతుల ఏకైక కుమార్తె దాసు నిషిత. నిషిత ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు. కాగా, నిషిత చిన్ననాటి నుంచే చదువులో రాణిస్తోంది. ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తిని వారు గమనించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చిన్నారికి ఇంగ్లిష్‌ సబ్జెక్టులో మంచి మార్కులు వస్తుండటంతో ఆ సబ్జెక్టులో మరింత ప్రోత్సహించారు. దీంతో నిషిత ఇతర సబ్జెక్టులతో పాటు ఇంగ్లిష్‌లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తూ వచ్చింది. నాలుగో తరగతి నుంచే ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడుతూ అబ్బుర పరుస్తోంది.

ఇంగ్లిష్‌ వ్యాకరణంపై పట్టు బిగించింది. తాను చదువుతున్న తరగతి సామర్థ్యాన్ని మించి ఆపై తరగతుల వారికి ఇంగ్లిష్‌ వ్యాకరణంలో మెళకువలు వివరిస్తూ శెభాష్‌ అనిపించుకుంటోంది. చక్కని చేతిరాతతో బోర్డుపై రాస్తూ కఠిన పదాలను సులభంగా వివరిస్తోంది. నిషిత ప్రతిభను మరింత బయటకు తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వారిని సంప్రదించగా వారి అనుమతితో అక్కడి విద్యార్థులకు ఇంగ్లిష్‌ వ్యాకరణాన్ని సులభ పద్ధతుల్లో వివరించి ఔరా అనిపించింది. ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునే విధానంపై కూడా అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఖమ్మంలోని డైట్‌ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో సైతం పాల్గొని ప్రాథమిక ఇంగ్లిష్‌ వ్యాకరణం, వాక్య ప్రయోగం అనే అంశాలపై అవగాహన కల్పించి ప్రశంసలు అందుకుంది.

యూట్యూబ్‌లో పాఠాలు.. 
ఆంగ్ల భాషలో దూసుకెళ్తున్న నిషిత తన తండ్రి ప్రోద్బలంతో సొంతంగా యూట్యూబ్‌ చానెల్‌ ఏర్పాటు చేసింది. ఇంగ్లిష్‌ వ్యాకరణం సులభంగా నేర్చుకునే విధానంపై పలు పాఠ్యాంశాలను రూపొందించి వాటిని యూట్యూబ్‌లో పొందుపరిచింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్ద ఉంటున్న విద్యార్థులెందరికో ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని అందిస్తోంది. తాను చదువుకుంటూ, సమయాన్ని సద్వినియోగ పర్చుకుంటూ తనలోని జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా చిన్నారి నిషిత చేస్తున్న సాహసం, అందిస్తున్న సహకారం అభినందనీయం. ఇది నేటి తరం విద్యార్థులకు ఆదర్శనీయం. 

మరిన్ని వార్తలు