డెల్టా కన్నా వేగం.. అయితే, గొంతులో ఒమిక్రాన్‌ లోడ్‌ 70 రెట్లు ఎక్కువ.. అదే ఊపిరితిత్తుల్లో మాత్రం

9 Jan, 2022 02:51 IST|Sakshi

తీవ్రత తక్కువని అజాగ్రత్త వహిస్తే ప్రమాదకరం 

అమెరికాకు చెందిన కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల హెచ్చరిక 

ఒమిక్రాన్‌–డెల్టా వేరియంట్ల బాధితులపై పరిశోధన 

60–65 ఏళ్లపైన వారిలో రెండు వేరియంట్లతో ఒకేరకమైన ప్రభావం 

కేసులు అత్యధికంగా వస్తే.. డెల్టా నాటికంటే ఎక్కువ నష్టం 

అంతా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచనలు 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌.. మన దేశంలోనూ ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. వారం కిందటి వరకు రోజుకు వందల్లో ఉన్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు లక్షన్నర దాకా వచ్చాయి. కేసుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతఏడాది బీభత్సం సృష్టించిన డెల్టా వేరియంట్‌.. ఇప్పుడు విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ మధ్య తేడాలు, ప్రభావాలపై అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీ విస్తృత పరిశోధన చేసింది.

ఈ రెండు వేరియంట్లను పోల్చి చేసిన తొలి పరిశీలన ఇదేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ హెల్త్‌ జర్నల్‌లో వివరాలు ప్రచురితమయ్యాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ అతివేగంగా వ్యాపిస్తోందని.. ప్రస్తుతానికి దాని తీవ్రత తక్కువగా ఉన్నా అజాగ్రత్త వహిస్తే మాత్రం డెల్టా కంటే ఎక్కువ ప్రమాదం జరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రయోగం సాగిందిలా.. 
అమెరికాలో పౌరుల ఆరోగ్య వివరాల(ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ ప్రొఫైల్‌)ను అక్కడి ప్రభుత్వం జాగ్రత్త చేస్తుంది. ఈ క్రమంలో గతేడాది జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్‌ 24వ తేదీ వరకు నమోదైన డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లకు సంబందించిన 5,63,884 కేసులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వయసు, స్త్రీ–పురుషులు, వివిధ వ్యాధులున్నవారిని వేర్వేరు గ్రూపులుగా విభజించారు. వారిలో డెల్టా సోకినవారిలో, ఒమిక్రాన్‌ సోకినవారిలో కనిపించిన దుష్ప్రభావాలను సాంకేతిక పద్ధతిలో గణించి ఫలితాలను క్రోడీకరించారు.

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత మూడో వంతు మాత్రమే ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆస్పత్రికి వెళ్లాల్సి రావడం, ఇన్‌పేషెంట్‌గా చేరడం, ఐసీయూలో ఉండాల్సి రావడం, వెంటిలేటర్‌ అవసరం పడటం వంటివి డెల్టా కంటే ఒమిక్రాన్‌తో మూడో వంతు తక్కువగా ఉన్నట్టు తేల్చారు. 

ఊపిరితిత్తులపై తక్కువ ప్రభావం 
సాధారణంగా కరోనా వైరస్‌ మొదట ముక్కు, నోరు ద్వారా గొంతులోకి చేరి.. తర్వాత ఊపిరితిత్తులకు విస్తరిస్తుంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ లోడ్‌ గొంతులో 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అదే ఊపిరితిత్తుల్లో మాత్రం 10 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

ఒమిక్రాన్‌ గొంతులో ఎంత ఎక్కువగా ఉన్నా.. ఊపిరితిత్తుల్లోకి చేరే లోడ్‌ తక్కువగా ఉండటం కాస్త ఊరట అని వారు చెప్తున్నారు. 60 ఏళ్లలోపు వారిలో ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువగానే ఉన్నా.. 60–65 ఏళ్లుపైబడిన వారికి, రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారికి మాత్రం ప్రమాదకరమేనని పరిశోధనలో గుర్తించారు.  

వ్యాప్తి పెరిగితే ప్రమాదమే! 
ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. దానిని తక్కువగా అంచనా వేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగం అత్యంత ఎక్కువని.. దానిని నిరోధించకుంటే అంచనాలు తారుమారై, ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వ్యాప్తి సమయంలో దేశంలో వ్యాక్సినేషన్‌ శాతం తక్కువ.

ఆ సమయంలో సగటున రోజుకు 206 మంది మరణించగా.. వారిలో వ్యాక్సిన్‌ తీసుకోనివారే 194 మంది అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ సంతృప్తికరంగానే ఉన్నా.. రెండు డోసులు తీసుకున్న వారికీ ఒమిక్రాన్‌ సోకుతుండటం ఆందోళనకరమని నిపుణులు చెప్తున్నారు. కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరితే.. మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  

వ్యాప్తిని అరికడితేనే మేలు కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా
ఎదుర్కోవాలంటే దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి. ప్రతిఒక్కరూ మా స్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి నిబంధనలు పాటిం చడం ద్వారా వ్యాప్తికి చెక్‌ పెట్టొచ్చు. కోవిడ్‌తో మరణించిన వారిలో 97 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఈ నెల 10వ తేదీ నుంచి బూస్టర్‌ డోస్‌ను కూడా అర్హులైన వారు తప్పకుండా తీసుకోవాలి. 


– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

మరిన్ని వార్తలు