సాంకేతికతపై పట్టుండాలి

12 Feb, 2023 02:39 IST|Sakshi
దీక్షాంత్‌ పరేడ్‌లో ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

సామాన్యుడికి న్యాయం చేసినప్పుడే పోలీసింగ్‌కు అర్థం  

యువ పోలీసు అధికారులు అంకితభావంతో పనిచేయాలి 

ఐపీఎస్‌ల దీక్షాంత్‌ పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

195 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న పరిస్థితుల్లో పోలీసింగ్‌లోనూ అనేక కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. సైబర్‌ నేరాలు, నార్కో టెర్రరిజం, సాంకేతికత ఆధారంగా పెరుగుతున్న ఇతర నేరాల కట్టడికి పోలీసులు కూడా సాంకేతికతపై పట్టు సాధించాలని సూచించారు. పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ ర్యాంకు వరకు అధికారులంతా సాంకేతికతపై అవగాహన పెంచుకోవడంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయ న పేర్కొన్నారు.

శనివారం సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో నిర్వహించిన 74వ రెగ్యులర్‌ రిక్రూటీ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల దీక్షాంత్‌ పరేడ్‌కు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 195 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలను అందజేశారు.

అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని కట్టడి చేయడం.. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల సమస్యలను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. 2047లో భారత దేశం వందవ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోబోతోందని, ఈ అమృతకాలంలో విధుల్లోకి వస్తున్న యువ అధికారులంతా దేశాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంలో తమవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

గత ఏడు దశాబ్దాలలో దేశం అంతర్గత భద్రతలో అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. ఈ కాలంలో 36,000 మంది పోలీసు సిబ్బంది దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారన్నారు. యువపోలీసు అధికారులంతా అమరుల స్ఫూర్తితో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని అన్నారు. సామాన్యుడి హక్కులను కాపాడటమే పోలీసింగ్‌కు నిజమైన అర్థం అని.. దీనిని ప్రతి యువ అధికారి గుర్తించాలని చెప్పారు.  

అకాడమీ డైరెక్టర్‌ ఏఎస్‌ రాజన్‌ మాట్లాడుతూ, అకాడమీలో అందించిన అత్యుత్తమ శిక్షణ ఐపీఎస్‌ అధికారుల వృత్తి జీవితంలో ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. పరేడ్‌ కమాండర్‌ షెహన్‌షా నాయకత్వంలో ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారులు నిర్వహించిన పరేడ్‌ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా, కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ డేకా, డీజీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు, ట్రైనీ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు