ఏవీఎన్‌ రెడ్డి గెలుపు.. చారిత్రాత్మక విజయం అంటూ అమిత్‌ షా ట్వీట్‌

17 Mar, 2023 16:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం పట్ల బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలియజేశారు. 

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారాయన. 

తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో అవినీతి పాలనతో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలోని పారదర్శకమైన బీజేపీ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని ట్వీట్‌ చేశారాయన.


అంతకు ముందు.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై నెలకొంది. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ 12,709 దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు