లక్ష్యసాధన వరకు విశ్రమించొద్దు: అమిత్‌ షా

19 Sep, 2021 03:18 IST|Sakshi

అధికారం మనదే కావాలి.. రాష్ట్ర నేతలకు అమిత్‌ షా దిశానిర్దేశం

ఈ రెండున్నరేళ్లు విసుగు లేకుండా పనిచేయాలని సూచన

సంజయ్‌ యాత్ర దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని ఆదేశం

ఎన్నికల ‘రోడ్‌ మ్యాప్‌’లో భాగంగా పలు అంశాలపై ప్రత్యేక దృష్టి

బీసీ–ఈ రిజర్వేషన్ల రద్దు.. ఎస్టీలకు 10 శాతం కేటాయింపు

గిరిజన, ఆదివాసీలను పూర్తిస్థాయిలో తమవైపునకు తిప్పుకునేలా వ్యూహం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ నాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిశానిర్దేశం చేశారు. వచ్చే రెండున్నరేళ్లు ఎలాంటి విసుగు, విరామం లేకుండా.. లక్ష్యసాధన దిశగా.. యావత్‌ పార్టీ నడుంబిగించాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ పాల నపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఉప యోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమనే విష యాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వివిధ కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. శుక్రవారం నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్న సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ తదితర ముఖ్య నేతలకు ఇదే అంశాన్ని సుస్పష్టం చేసి నట్లు సమాచారం. సంజయ్‌ పాదయాత్ర సాగు తున్న తీరును అమిత్‌ షా తెలుసుకుని, ఇదే ధోర ణిని కొనసాగించాలని సూచించినట్లు తెలు స్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ ఏ మేరకు పుంజుకుంటోంది, ఇంకా ఏయే అంశాలపై దృష్టిపెట్టాలి, పార్టీనేతలంతా పాదయాత్రలో భాగస్వాములౌతున్నారా.. లేదా.. అన్న అంశాలపై కిషన్‌రెడ్డి అడిగి ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి: 2.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు చూసి

ఎన్నికల ‘రోడ్‌ మ్యాప్‌’ఖరారు...
కాగా, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార కైవసానికి ప్రధాని మోదీ సహా అమిత్‌షా, జేపీ నడ్డాల అగ్రనాయకత్వం పక్కా ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రోడ్‌మ్యాప్‌ను కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే మతప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలుచేస్తున్న 4 శాతం బీసీ–ఈ రిజర్వేషన్లను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని నిర్మల్‌ సభలో అమిత్‌షా ప్రకటించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. వివిధ వర్గాలు, రంగాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు అగ్రనేతలు ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన రాంజీ గోండు వీరత్వం, ‘వెయ్యి ఉరుల మర్రి’ఉదంతం ఘటనలను తెరమీదకు తెచ్చి.. నిర్మల్‌లో సభ నిర్వహించి ఆ చుట్టుపక్కల జిల్లాలు, ప్రాంతాల్లో గిరిజన, ఆదివాసీల మద్దతును సాధించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఎస్టీలను ఆకట్టుకునేందుకు వారి రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచే హామీని మేనిఫెస్టోలో పెట్టే కసరత్తు చేస్తున్నారు. చదవండి: కెప్టెన్‌ కథ కంచికి చేరిందిలా!

ధ్యాసంతా పాదయాత్రపైనే...
తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్‌ 2న ముగియనుంది. యాత్ర సాగిన 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాని ప్రభావం, ప్రజల స్పందన, పార్టీ పట్ల వారి వైఖరి, తదితర వివరాలు సేకరించాలని అధినాయకత్వం ఆదేశించింది. అనంతరం రెండోదశ యాత్ర ప్రారంభించాలని సూచించింది. ప్రణాళికాబద్ధంగా వివిధ ప్రాంతాలు, వర్గాల వారీగా నియోజకవర్గాలను విభజించుకుని బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది. దీనికి అనుగుణంగా వచ్చే రెండున్నరేళ్లు దశలవారీగా పాదయాత్ర కొనసాగిస్తూ పార్టీ జనాల్లోకి వెళ్లాలని పేర్కొంది. 2016లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించడంతో పాటు, ప్రత్యేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృత పర్యటన, విమోచన దినోత్సవం కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు ప్రజల్లో బీజేపీ వైపు మొగ్గు ఉందని అంచనాలు వేశారు. అయితే రాష్ట్ర నాయకత్వం పూరిస్థాయిలో కృషిచేయని కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదని ఆ తర్వాత విశ్లేషించారు. 2018 ఎన్నికలకు ముందు కూడా పార్టీ బలపడుతోందని జాతీయ నాయకత్వం భావించినా ఆశలు వమ్మేఅయ్యాయి. ఈసారి అలా జరగకుండా ఉండేలా దాదాపు మూడేళ్ల ముందు నుంచే అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు