16న హైదరాబాద్‌కు అమిత్‌షా 

14 Sep, 2022 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన 16న సాయంత్రం నగరానికి చేరుకుంటారు. 17న ఉదయం పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాల సైనిక వందనాన్ని స్వీకరిస్తారు.

ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. హైదరాబాద్‌ సంస్థానం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధులు లేదా వారి కుటుంబసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ జన్మదినం కూడా కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సేవా కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొంటారు. ఇందులో భాగంగా వికలాంగులు, ఇతర వర్గాలకు ఉపయోగపడే అంబులెన్స్‌ల అందజేత, దివ్యాంగులకు మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్ల పంపిణీ, వివిధ హాస్టళ్లవారికి మరుగుదొడ్లను శుభ్రం చేసే ప్రత్యేక పరికరాలు, యంత్రాలు (బోస్చ్‌)అందజేస్తారు. 

రేపు స్కూటర్‌ ర్యాలీలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి 
తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోటార్‌/స్కూటర్‌ ర్యాలీలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొంటారు. గురువారం ఉదయం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ.. నేరుగా పరేడ్‌గ్రౌండ్స్‌కు, అక్కడినుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు సాగుతుంది.   

>
మరిన్ని వార్తలు