ఈనెల 23న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా?

18 Apr, 2023 02:35 IST|Sakshi

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించే అవకాశం... 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికారపార్టీ ముఖ్యనేత చేరికపై జోరుగా ప్రచారం.. 

కాంగ్రెస్‌ నేతలూ చేరతారని ఊహాగానాలు 

‘లోక్‌సభ ప్రవాసీ యోజన’ అమలు తీరుపై రేపు సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. ఆ రోజు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తారని, ఆ సందర్భంగా జరిగే సభలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికారపార్టీ ముఖ్యనేత ఒకరు బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ మాజీ మంత్రితో పాటు, మరికొందరు కాంగ్రెస్‌ నేతలు చేరొచ్చు నని పార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వికారాబాద్‌లో పర్యటించి రావడంతో పాటు అక్కడ చేయాల్సినæ సన్నాహాలను పరిశీలించారని అంటున్నారు. దీంతో అమిత్‌ షా రాక ప్రచారానికి మరింత బలం చేకూరింది. 

గతంలో రెండుసార్లు రద్దు కావడంతో... 
గతంలో రెండు సార్లు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అమిత్‌షా పర్యటిస్తారని భావించినా అధికారిక కార్యక్రమాల వల్ల చివరి నిమిషంలో అవి రద్దయ్యాయి. అయితే ఈ సారి ‘లోక్‌సభ ప్రవాసీ యోజన’లో భాగంగా ఆయన ఈ పర్యటనకు వస్తున్నట్టు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాని మోదీ చారిత్రక హాట్రిక్‌ విజయాన్ని రికార్డ్‌ చేయాలనే లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని ఎంపీ స్థానాల్లో ‘లోక్‌సభ ప్రవాసీ యోజన’ను బీజేపీ చేపట్టింది.

ఇందులో భాగంగానే జాతీయ స్థాయి ముఖ్యనేతలు, కేంద్రమంత్రులు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో విడతల వారీగా పర్యటనలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ ఏ మేరకు పటిష్టంగా ఉంది, స్థానికంగా బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉంది వంటి అంశాలపై క్షేత్ర స్థాయి పరిశీలనలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనల అనంతరం జాతీయనాయకత్వానికి వాస్తవ పరిస్థితులపై నివేదికలు సమర్పిస్తున్నారు. 

3 రోజులు జాతీయనేతలు ఇక్కడే... 
రాష్ట్రంలోని ఎంపీ స్థానాల్లో ‘లోక్‌సభ ప్రవాసీ యోజన’అమలుతీరుపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో అమిత్‌షా వర్చువల్‌గా పాల్గొనే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జీలు తరుణ్‌చుగ్, సునీల్‌బన్సల్, కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌చార్జీ అర్వింద్‌ మీనన్‌ బుధ, గురు, శుక్రవారాల్లో ప్రవాసీయోజనతో పాటు రాష్ట్ర పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాలు, పార్టీపరంగా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.

బీజేపీ జాతీయనాయకత్వానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారడంతో పార్టీ సన్నద్ధమవుతున్న తీరును అమిత్‌షాతో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు ప్రత్యక్షంగా పరిశీలించి, దిశానిర్దేశం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి చేరికల వ్యూహానికి రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం మరింత పదునుపెడుతోంది.   

మరిన్ని వార్తలు