‘హైదరాబాద్‌ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్‌’

11 Aug, 2020 17:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కట్టుదిట్టమైన భద్రత మధ్య చెన్నై పోర్టునుంచి అమ్మోనియం నైట్రేట్‌ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. మొత్తం ఎనిమిది కంటైనర్లలో వచ్చిన అమ్మోనియం నైట్రేట్‌ను కీసరగుట్టలో సాల్వో ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీ నిల్వ చేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సాల్వో కంపెనీ రీప్రాసెస్‌ చేయనుంది. ఈ ప్రక్రియ తర్వాత కోల్‌ ఇండియా, సింగరేణి, నీటి పారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు. రెండో రోజుల్లో రీప్రాసెసింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని సాల్వో కంపెనీ పేర్కొంది. (హైదరాబాద్‌కు ‘అమ్మో’నియం నైట్రేట్‌)

అయితే ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్ల తర్వాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బీరుట్‌ పేలుళ్ల అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించారు. లెబనాన్‌ పేలుళ్లతో చెన్నై పోర్టు నుంచి హైదరాబాద్‌ తరలించినట్లు సాల్వో కంపెనీ పేర్కొంది. కాగా అమ్మోనియం నైట్రేట్‌ హైదరాబాద్‌కు తరలింపుపై సోమవారం ట్విట్టర్‌లో గవర్నర్ స్పందించిన విషయం తెలిసిందే. 'ఆదివారం రాత్రి అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలియడంతో ప్రజల భద్రత గురించి ఆందోళనకు గురయ్యాను. పరిస్థితిని అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడాను.' అని ట్విట్టర్‌లో తమిళిసై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు