కొత్త కొత్తగా.. టైగర్ సఫారీ

14 Jan, 2023 01:58 IST|Sakshi
అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం 

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో మరోసారి ‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’ 

20న లాంఛనంగా మంత్రితో ప్రారంభం

ఆ తర్వాతే పర్యాటకులకు..!

కొత్త హంగులు, ఆకర్షణలతో ట్రెక్కింగ్‌ ఇతర ఏర్పాట్లు.. చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌ గైడ్‌లు

‘సాక్షి’తో అమ్రాబాద్‌ డీఎఫ్‌ఓ రోహిత్‌

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరంలో కొత్త హంగులు, ఆకర్షణలతో ప్రజలకు మరోసారి ‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’.. అందులో భాగంగా  ‘టైగర్‌ సఫారీ’ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో  అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) పచ్చటి అడవితో పాటు జీవవైవిధ్యానికి ప్రతీకగా పెద్ద పులుల ఆవాసం, విభిన్నరకాల పువ్వులు, ఔషధమొక్కలు, వాగులు, వంకలకు కేంద్రమై ఉంది.

పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఏటీఆర్‌ పరిధిలో ఈ నెల 20వ తేదీన  టైగర్‌ సఫారీని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యాటకులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనేది త్వరలోనే వెల్లడిస్తారు. 2021 నవంబర్‌లో ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో తొలిసారిగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టైగర్‌ సఫారీని ఏడాదికొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో కోవిడ్‌ రెండో దశ ఉధృతమవడంతో 2022లో ఈ సఫారీ నిర్వహణ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు  ప్రారంభించాలని అటవీశాఖ నిర్ణయించింది. 

ఏమిటీ ‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’ ?
వైల్డ్‌లైఫ్‌ టూరిజంలో టైగర్‌ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్‌ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని ఆకర్షణలను జతచేస్తున్నారు. దాదాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదదీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బసతో కొత్త అనుభూతిని కలిగించే అవకాశం కల్పిస్తారు.

మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు అటవీశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్‌ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లకు తీసుకెళ్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌నకు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్‌ సఫారీకి తీసుకెళ్ళడంతో టూర్‌ ముగుస్తుంది. ఈ టూర్‌లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌ గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. 

►గతంలో 2 పాత వాహనాలను టైగర్‌ సఫారీకి ఉపయోగించారు.  ఇప్పుడు 8  కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. గతంలో 12 మందికి వసతి అవకాశం కల్పించగా ఇప్పుడు 24 మందికి వసతి ఏర్పాట్లు ఇస్తున్నారు. 

►అతిథుల కోసం ఆధునిక వసతులు, సౌకర్యాలతో కొత్తగా 6 మట్టి కాటేజీలు నిర్మించారు.

కొత్తగా ఏవి అందుబాటులోకి వచ్చాయంటే ?
►‘ట్రీహౌజ్‌’–చెట్టుపై నిర్మించిన ఇళ్లు కొత్తగా అందుబాటులోకి.. ‘ట్రీహౌజ్‌’ నుంచి రాత్రిపూట సమీపంలో పర్‌క్యులేషన్‌ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణ
►అందుకోసం నైట్‌విజన్‌ బైనాక్యులర్స్‌ ఏర్పాటు
►కొత్తగా ఎయిరోకాన్‌ హౌజ్‌ తదితరాల ఏర్పాటు
►గతంలో పైనుంచి ఒకరూట్‌లోనే సఫారీ నిర్వహించారు. ఇప్పుడు కిందనున్న చెరువు దాకా (ఉమామహేశ్వరం గుడి) వెళ్లాలని అనుకునే వారికి అదనపు చార్జీలతో మరో కొత్తరూట్‌ ఏర్పాటు
►ఈ ప్యాకేజీ టూర్‌లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకునే వీలు కల్పిస్తారు.

►2023 జనవరి 4వ వారం నుంచి జూన్‌ 30 వరకు (ప్రతీరోజు 24 మంది చొప్పున) ఈ ప్యాకేజీని ఉపయోగించుకునే వీలుంది. 
►ఒక్కరికి, ఇద్దరికి లేదా ఒక గ్రూపునకు సంబంధించి టికెట్‌ ధరలు ఎంత ఉంటాయనే దానిపై ఇంకా అటవీశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో వైల్డ్‌లైఫ్‌ టూరిజం/ సఫారీ ప్యాకేజీలో భాగంగా ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ.9,600గా ధరలు నిర్ణయించారు. 

ఈసారి ఇంకా కొంగొత్తగా..
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అటవీ, జంతు­ప్రేమికులకు మరింత ఆహ్లాదం పంచే విధంగా చర్యలు చేపట్టాం. ఏటీఆర్‌లో కెమెరా ట్రాప్‌లకు చిక్కిన పులుల ఫొటోలతో రూపొందించిన ‘టైగర్‌ బుక్‌ ఆఫ్‌ ఏటీఆర్‌’ పుస్తక ఆవిష్కరణ, ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఏటీఆర్‌’ పేరిట పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న చెంచు­గైడ్స్‌కు బహుమతులు వంటి కార్యక్రమాలు చేపడు­తున్నాం.

గతేడాది టైగర్‌ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఇప్పుడు పులుల సంఖ్య గణనీయంగా పెరిగినందున  సైటింగ్స్‌ మరింత పెరగవచ్చు.
–ఐఎఫ్‌ఎస్‌ అధికారి రోహిత్‌ గొప్పిడి, అమ్రాబాద్‌ డీఎఫ్‌ఓ 

మరిన్ని వార్తలు