అందుకేనేమో.. అది ఆనంద నిలయం 

18 May, 2021 12:59 IST|Sakshi

 సెకండ్‌ వేవ్‌లో కరోనా ఉధృతికి అపార్ట్‌మెంట్‌ వాసుల అడ్డుకట్ట..  ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్తలు  కలసికట్టుగా కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్న వైనం

హైదరాబాద్‌: బస్తీ, కాలనీ, అపార్ట్‌మెంట్‌ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో బంజారాహిల్స్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలోని శ్రీఆనంద నిలయం అపార్ట్‌మెంట్‌లో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇందుకు గల కారణం అపార్ట్‌మెంట్‌వాసులు కలిసికట్టుగా కరోనాను కట్టడి చేస్తున్నారనే చెప్పాలి. అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అవసరం ఉంటేనే బయటికి రావడం, అనవసరంగా తిరగకపోవడంతో పాటు అపార్ట్‌మెంట్‌లోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కరోనా వైరస్‌ ఈ అపార్ట్‌మెంట్‌ దరిదాపులకు కూడా సోకలేదు.  

వీరేం చేశారంటే... 
శ్రీ ఆనంద నిలయం అపార్ట్‌మెంట్‌లో మొత్తం 9 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో సీనియర్‌ సిటిజన్లు కూడా ఉన్నారు.   ప్రతివారం అపార్ట్‌మెంట్‌ మెట్లు, బాల్కనీల తో పాటు పరిసరాలను తమ సొంత డబ్బులతోనే శానిటైజ్‌ చేయిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా, దోమల ఆవాసం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. మాస్క్‌ లేకుండా ఒక్కరూ కూడా ప్లాట్‌ దాటి బయటికి రాకూడదని షరతులు విధించారు. పని మనుషులు, డ్రైవర్లు వచి్చనప్పుడు లిఫ్ట్‌ వద్దనే తప్పనిసరి శానిటైజ్‌ చేసుకొని మాస్క్‌ ధరించి ఆయా ఫ్లాట్లకు వెళ్లాలి.  

పని మనుషులు, డ్రైవర్లు తప్పనిసరిగా ఫ్లాట్‌ బయట చెప్పులు విడిచి అక్కడ ఉంచిన నీళ్ల తో కాళ్లు కడుక్కున్న తర్వాతనే లోనికి వెళ్లాలి.  స్విగ్గి, జొమాటొ, ఇతర పార్సిళ్లను తీసుకొచ్చిన వారు బయటనే ఉండి ఫోన్లు చేస్తే సంబందీకులు గేటు బయటికి వెళ్లి వాటిని రిసీవ్‌ చేసుకోవాలి. తీసుకున్న పార్సిళ్లను లిఫ్ట్‌ వద్దనే చేతులు శానిటైజ్‌ చేసుకున్న తర్వాత పైకి వెళ్లే విధంగా నిబంధనలు పెట్టారు. ఈ కరోనా అంతమొందే వరకు అనవసరంగా చుట్టాలు, బంధుమిత్రులు రావొద్దని చెప్పడం జరిగింది. గత ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరి ఇంటికి కూడా చుట్టాలు రాకు ండా వాళ్లకు వాళ్లే జాగ్రత్తలు తీసుకున్నారు. 

 అందరం కలసికట్టుగా ఉన్నాం      
మా అపార్ట్‌మెంట్‌లో నివాసితులంతా కలసికట్టుగా ఉండి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిలబడ్డాం. ప్రతి నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. ఏ ఒక్క దగ్గర కూడా నిబంధనలకు పాతర వేయడం లేదు. కలసికట్టుగా ఉండి నిబంధనలు అమలు చేస్తే కరోనా దరి చేరదని మేము నిరూపిస్తున్నాం. మా అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు సీనియర్‌ సిటిజన్లు కూడా ఉన్నారు. వారు కూడా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఏ ఒక్కరూ తిరగడం లేదు. బయటికి కూడా రావడం లేదు. 

ఒక వేళ అవసరాలకు వచ్చినా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం చేస్తున్నారు. గతంలో లాగా కారిడార్లలో నిలబడి ముచ్చట్లు పెట్టుకోవడం నిషేధించారు. నలుగురు కలిసే కార్యక్రమాలన్నీ నిలిపివేశాం. ఇంకో నెల రోజులు కష్టపడితే అదృష్టవశాత్తు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండి మాస్క్‌లు ధరించాలి. 
– ఎంవీఎల్‌ఎన్‌ శాస్త్రి, సెక్రెటరీ, శ్రీఆనంద నిలయం

>
మరిన్ని వార్తలు