‘లవుడు’ కన్నుమూత 

8 Sep, 2020 03:24 IST|Sakshi

లవకుశ చిత్రంలో అద్భుత పాత్ర పోషించిన నాగరాజు గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు.. 

చిక్కడపల్లి (హైదరాబాద్‌): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం లవకుశలో లవుడు పాత్ర పోషించిన నటుడు ఆనపర్తి నాగరాజు సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2017లో ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో నాగరాజు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ వచ్చింది. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన.. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోవడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నాగరాజు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.  

340 చిత్రాల్లో నటన... 
నాగరాజు అసలు పేరు.. నాగేందర్‌రావు. 340కి పైగా చిత్రాల్లో నటించారు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏ.వీ.సుబ్బారావు కుమారుడే నాగరాజు. భక్తరామదాసు సినిమాలోనూ చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించారు. హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ వద్ద నిర్మించిన ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. అలా వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే జీవితం సాగిస్తున్నారని లవకుశలో కుశుడిగా నటించిన సుబ్రహ్మణ్యం తెలిపారు. తాను అమలాపురంలో టైలర్స్‌ షాపును ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల శ్రీకామాక్షి పీఠంలో జరిగిన కార్యక్రమానికి నాగరాజు, సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథులుగా హాజరుకావడం విశేషం.  

>
మరిన్ని వార్తలు