లగ్జరీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు!

9 Mar, 2021 08:14 IST|Sakshi

ఇళ్లకు భారీగా పెరిగిన అద్దెలు!

ఐటీ కారిడార్‌లో 26 శాతం పెరుగుదల

ఏడేళ్లుగా క్రమంగా పెరుగుతోన్న అద్దెలు

2014తో పోలిస్తే ఇప్పుడు భారీ వృద్ధి

వర్క్‌ఫ్రం హోం కారణం 

అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ పరిధిలో లగ్జరీ ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో వందలాది ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతించడంతో.. భారీగా వేతనాలు అందుకుంటున్న ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాలకు చెందిన ఉన్నతోద్యోగులు, టీమ్‌లీడర్లు, సీఈఓలు, కార్పొరేట్లు లగ్జరీ ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు.  

వీరిలో ఇప్పటికే చాలా మంది భారీగా అద్దెలు చెల్లించి విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తాజాగా చేపట్టిన అధ్యయనంలో  వెల్లడించింది. ఈప్రాంతంలో 2014తో పోలిస్తే ప్రస్తుతం అద్దెల విషయంలో సుమారు 26 శాతం మేర పెరుగుదల నమోదైందని తెలిపింది. ఇక లగ్జరీ ఇళ్ల సెగ్మెంట్‌లో భారీగా అద్దెలు వసూలు చేస్తున్న నగరాల్లో మన గ్రేటర్‌ హైదరాబాద్‌ తరవాత స్థానంలో నిలిచిన బెంగళూరులో 24 శాతం..ఆతరవాత నిలిచిన చెన్నై, కోల్‌కతా నగరాల్లో 19 శాతం అద్దెల్లో పెరుగుదల నమోదైనట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.  

అద్దెల భూమ్‌కు కారణాలివే.. 
► కోవిడ్‌ కలకలకం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంకు పరిమితమవడం. 
►ఇల్లునే ఆఫీసుగా మార్చుకునేందుకు పలువురు లగ్జరీ ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిచూపడంతోపాటు..ఇంట్లో సువిశాల ప్రాంగణాన్ని ఆఫీసు కార్యకలాపాలకు  వినియోగించుకుంటున్నారు. 
► నగరంలో ఐటీ కారిడార్‌ కాస్మొపాలిటన్‌ కల్చర్‌కు కేరాఫ్‌గా నిలవడంతోపాటు విద్య,వైద్య,మౌలికవసతులు అందుబాటులో ఉండడంతో చాలా మంది ఈప్రాంతంలో అద్దెకుండేందుకు ఇష్టపడడం. 
► బహుళజాతి కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఐటీ కారిడార్‌ చిరునామాగా మారడం. సమీప భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు ఈప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలుండడం. 
► పలు ఐటీ, బీపీఓ, కెపిఓ సంస్థలు తమ సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులకు లగ్జరీ ఇళ్లలో వసతి సదుపాయం ఏర్పాటుచేయడం. 

మెట్రోనగరం ప్రాంతం ఇళ్ల అద్దెల్లో పెరుగుదల శాతం 
హైదరాబాద్‌ ఐటీకారిడార్‌  26 
బెంగళూరు జేపినగర్‌  24 
చెన్నై కొట్టుపురం 19
కోల్‌కతా  అలీపూర్ 19
>
మరిన్ని వార్తలు