‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్‌

1 Apr, 2023 01:46 IST|Sakshi

ఇతర ఏ సంస్థ వివరాలూ మావద్ద లేవు

నాంపల్లి మేజిస్ట్రేట్‌ కూడా దీన్ని ధ్రువీకరించారు

తనిఖీలు ముగిసినందున పిటిషన్‌ను కొట్టివేయాలి

తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ ఫండ్స్, అనుబంధ సంస్థల డేటా మినహా మరే ఇతర సంస్థలకు చెందిన డేటా తాము సీజ్‌ చేసిన డాక్యుమెంట్లలో లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సీజ్‌ చేసిన డాక్యుమెంట్ల జాబితాపై నాంపల్లి 14వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సంతకం చేశారని, ఆ కాపీని కోర్టుకు కూడా సమర్పించామని తెలిపింది.

ఎలాంటి ఆధారాలు లేకుండా, విచారణను జాప్యం చేసేందుకే పిటిషనర్‌ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. తమ సంస్థలో తనిఖీలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ బ్రహ్మయ్య అండ్‌ కో, పెద్ది చంద్రమౌళి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున స్పెషల్‌ కౌన్సిల్‌ పి.గోవింద్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

తనిఖీలు ఆపాలని మాత్రమే కోరారు.. 
‘మార్గదర్శిపై పలు ఆరోపణలున్నాయి. చిట్స్‌ ద్వారా వచ్చిన నగదును షేర్‌మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ప్రధాన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇది బడా వైట్‌ కాలర్‌ నేరం. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మయ్య అండ్‌ కో కార్యాలయ తనిఖీల్లో మాత్రం పోలీసులు పాల్గొన్నారు.

ప్రధాన కేసు విచారణ సందర్భంగా పలు డాక్యుమెంట్లను అధికారులు అడిగారు. మార్గదర్శి చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరిస్తున్న బ్రహ్మం అండ్‌ కో వాటిని ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తనిఖీలు ఆపాలని మాత్రమే పిటిషనర్‌ కోరారు. అవి ఎప్పుడో ముగిశాయి కనుక పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని గోవిందరెడ్డి కోర్టుకు నివేదించారు. 

ప్రత్యేకంగా విచారణ ఎందుకు?
‘మార్గదర్శి చిట్స్‌కు సంబంధించి కోర్టు విధుల సమయం ముగిసిన తర్వాత కూడా ప్రత్యేకంగా విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? సామాన్యుడికి ఏదైనా ప్రాణం మీదకు వస్తే కోర్టు ఇలాగే వ్యవహరిస్తుందా..? ఇది ఎంత వరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

లంచ్‌మోషన్‌ పిటిషన్‌లు వేయడం, కోర్టు విధులు ముగిసిన తర్వాత అత్యవసరంగా విచారణ జరిపి ఉత్తర్వులు పొందడం ద్వారా మార్గదర్శికో నీతి – సామాన్యుడికో నీతి అనే అభిప్రాయం నెలకొనే అవకాశం ఉంది’ అని విచారణ సందర్భంగా స్పెషల్‌ కౌన్సిల్‌ పి.గోవింద్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. వాదనల అనంతరం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను న్యాయమూర్తి ఏప్రిల్‌ 13వతేదీకి వాయిదా వేశారు.  

తనిఖీలు ముగిశాక విచారణా?
తనిఖీలు ముగిసిన తర్వాత వాటిని ఆపాలన్న విజ్ఞప్తిపై ఇక విచారణ ఎలా కొనసాగిస్తామని పిటి­షనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నళిన్‌కుమార్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ పిటిషన్‌లో ఇంటర్‌ లొక్యుటరీ అప్లికేషన్‌(ఐఏ) దాఖలు చేశామని నళిన్‌కుమార్‌ నివేదించారు.

మరిన్ని వార్తలు