216 టీఎంసీలు కేటాయించండి 

5 Sep, 2020 04:22 IST|Sakshi

 కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి తమ సాగు, తాగునీటి అవసరాల కోసం 216 టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. నాగార్జునసాగర్‌ కుడి కాలువకు 90, ఎడమ కాలువకు 20 టీఎంసీలు విడుదల చేయాలని ప్రతిపాదించింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 79 టీఎంసీలు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 27 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనాకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. అందులో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవీ.. 
► ఈనెల 2 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగుల్లోనూ.. నాగార్జునసాగర్‌లో 587.9 అడుగుల్లో నీరు నిల్వ ఉంది. 
► రెండు ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా జూలై నుంచి డిసెంబర్‌ వరకూ అవసరమయ్యే సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయించి.. విడుదల చేయండి.
► ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 9, హంద్రీ–నీవాకు 8 టీఎంసీలు కేటాయించాలని ఆగస్టు 5న ప్రతిపాదనలు పంపాం. వీటితోపాటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 66, హంద్రీ–నీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని ఆగస్టు 18వ తేదీన కోరాం.  
► ఇప్పుడు వాటికి అదనంగా నాగార్జునసాగర్‌ నుంచి 110, శ్రీశైలం నుంచి 106 టీఎంసీలు కేటాయించాలని కోరుతున్నాం.

>
మరిన్ని వార్తలు