అంగన్‌వాడీలకు ‘అద్దె’ కష్టాలు!

19 Jul, 2021 07:59 IST|Sakshi

భైంసాలోని ఓవైసీ నగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రానికి రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని శనివారం ఇలా ఇంటికి తాళం వేశాడు. సరుకులన్నీ బయటపెట్టడంతో అంగన్‌వాడీ టీచర్‌ లబ్ధిదారులకు ఆరుబయటే టీహెచ్‌ఆర్‌ పంపిణీ చేసింది. విషయం తెలుసుకున్న సీడీపీవో నాగలక్ష్మి, సూపర్‌వైజర్‌ రాజశ్రీ అక్కడికి చేరుకుని యజమానికి సర్దిచెప్పడంతో మళ్లీ తాళం తీశాడు.. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లాలోని పలు ప్రాజెక్టుల పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలలో ఇదే పరిస్థితి. సకాలంలో అద్దె బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.

భైంసాటౌన్‌(నిర్మల్‌): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తిప్పలు త ప్పడం లేదు. అద్దె భవనాలకు నెలనెలా బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. యజమానులు ప్రతినెలా కిరాయి చెల్లించాలంటున్నారని, అయితే తమకు ఏడాదికోసారి కూడా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు.

రూ.21.40లక్షల వరకు పెండింగ్‌లో..
భైంసా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో భైంసారూరల్, అర్బన్, కుభీర్, కుంటాల మండలాలు ఉండగా, వీటి పరిధిలో 205 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సంబంధించి ఆగస్టు 2020 నుంచి బిల్లులు రావాల్సి ఉంది. దాదాపు రూ.21.40 లక్షల వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు సొంతంగా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. డబ్బులు సర్దుకాని సందర్భాల్లో కొన్నిచోట్ల యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నారు. పట్టణంలోని ఓవైసీనగర్‌లో అద్దె భవనంలో ఉన్న సెంటర్‌ అద్దె చెల్లించకపోవడంతో యజమానికి తాళం వేసి, సరుకులన్నీ బయటపె ట్టాడు. దీంతో సూపర్‌వైజర్లు వచ్చి సర్దిచెప్పాల్సిన పరిస్థితి. గతంలో సైతం పులేనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రానికి సైతం అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు.  

సొంత భవనాలుంటే...
జిల్లావ్యాప్తంగా 363 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 3వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వర కు వీటికి అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఈ బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని టీచర్లు చెబు తున్నారు. అయితే ఏటా రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం, సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నెలనెలా చెల్లించాలి..
అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు ఏడాదికిపైగా బిల్లులు రావాల్సి ఉంది. మేం మాత్రం నెలనెలా చెల్లించాల్సి వస్తుంది. కేవలం రెండునెలల కిరాయి చెల్లించకపోవడంతో యజ మాని తాళం వేశాడు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు మంజూరు చేస్తే మాకు ఇబ్బంది ఉండదు.

– జయశ్రీ, అంగన్‌వాడీ టీచర్, భైంసా 

బిల్లులు పంపించాం..
భైంసా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల అద్దెలకు సంబంధించి బిల్లులు పంపించాం. ఆగస్టు 2020 నుంచి చెల్లించాల్సి ఉంది. యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. బడ్జెట్‌ కేటాయించగానే బిల్లులు చెల్లిస్తాం.

– నాగలక్ష్మి, ఇన్‌చార్జి సీడీపీవో, భైంసా 

మరిన్ని వార్తలు