ఫ్యామిలీ పోలీస్‌గా అంగన్‌వాడీ టీచర్లు 

14 May, 2021 09:31 IST|Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌: అంగన్‌వాడీలు అంటే ఫ్యామిలీ పోలీస్‌గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మం త్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు నిత్యావసరాలు అందించడం, ఇంటింటి సర్వే నిర్వహణ, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ సమయంలో మహిళా, శిశు, సంక్షేమశాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి మహబూబాబాద్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాఖ కమిషనర్, ప్రత్యేకకార్యదర్శి దివ్య, జిల్లాల సంక్షేమ శాఖ ల అధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం అందజేయాలని మంత్రి సూచించారు.


భార్య అంత్యక్రియలు.. కాసేపటికే భర్త మృతి
తూప్రాన్‌: అనారోగ్యంతో మృతిచెందిన భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త గుండె ఆగింది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులు కేవలం 12 గంటల వ్యవధిలో మృతి చెందారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాయిపల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ చాంద్‌బీ (60), సయ్యద్‌ హుస్సేన్‌ (70) దంపతులు. 10 రోజుల క్రితం చాంద్‌బీ తీవ్ర జ్వరం, డయేరియాతో ఇబ్బందులు పడుతుండడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్‌ వచి్చంది. ఇంట్లోనే మందులు వాడుతూ ఉన్న చాంద్‌బీ బుధవారం రాత్రి మృతి చెందింది. ఉదయం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాసేపటికే భర్త ఇంట్లో టీ తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 12 గంటల వ్యవధిలో భార్య, భర్త మృతి చెందడంతో గ్రామంలో విషాదం ఆలుముకుంది. గ్రామ సర్పంచ్‌ లంబ వెంకటమ్మ వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసింది.

మరిన్ని వార్తలు