అంకుర ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

13 Feb, 2022 04:41 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు  

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని అంకుర ఆస్పత్రిలో అత్యంత అరుదైన ఆపరేషన్‌ నిర్వహించి కవలలను బతికించినట్లు ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గా ప్రసాద్, కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శారదావాణి వెల్లడించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన మహిళ అత్యంత అరుదైన రకానికి చెందిన గర్భంతో ఉన్నట్లుగా గర్భధారణ జరిగిన తర్వాత 18వ వారంలో తాము గుర్తించామన్నారు.

ఆమె మోనో కొరియోనిక్‌ ట్విన్స్‌ (గర్భాశయంలో ఇద్దరు పిల్లలు ఒకే ప్లాజంటా అమినిటిక్‌ సాక్‌ను పంచుకోవడం)గా కలిగి ఉన్నట్లు తేలిందిన్నారు. ఇలా ఉండటం అత్యంత అరుదని 35 వేల నుంచి 60 వేల గర్భాల్లో ఒకటి మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటాయన్నారు. దీని వల్ల పిండాలకు తీవ్ర మైన సమస్యలు తలెత్తుతాయని అలాంటి స్థితిలో పిండాలు బతికేందుకు 50 శాతం వరకు అవకాశం ఉంటుందన్నారు.

ఈ కేసు విషయంలో కవలలకు ఒకరికి కపాలం, మెదడు అసంపూర్ణంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో గర్భంలో ఉన్న శిశువును సెలక్టివ్‌ రిడెక్షన్‌ ప్రత్యేక టెక్నిక్స్‌ను ఉపయోగించి తొలగించడం జరిగిందన్నారు. ఇది దేశంలోనే అత్యంత అరుదైంది అన్నారు. ప్రసవం జరిగే వరకు ఎంతో జాగ్రత్తగా పరిశీలించాల్సి వచ్చిందన్నారు. వీరిని బతికించడం, డెలివరీ చేయడం సవాళ్లతో కూడుకున్నదని చక్కని వైద్య నిపుణులతో మంచి ఉపకరణాలున్న ఎన్‌ఐసీయూలతో ఇలాంటి కేసులో ఫలితాలు సాధించామని వారు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు