Annam Seva Foundation: చేరదీసి.. చక్కగా చేసి..

10 Aug, 2021 04:03 IST|Sakshi
శ్రీనివాసరావుకు నమస్కరిస్తున్న జార్ఖండ్‌ జడ్జి

మతిస్థిమితం లేని అస్సాం, జార్ఖండ్‌వాసులను ఆదుకున్న ‘అన్నం’ ఫౌండేషన్‌ 

కుటుంబసభ్యులకు అప్పగింత 

పాదపూజ చేసిన కుటుంబీకులు.. చేతులెత్తి నమస్కరించిన న్యాయమూర్తి 

ఖమ్మం క్రైం: మానవత్వం ఎల్లలు దాటింది.. గ్రామం, మండలం, జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు చేరిన సేవా తత్పరుడికి అక్కడి ప్రజలు పాదపూజ చేశారు. ఏకంగా జిల్లా జడ్జి చేతులెత్తి నమస్కరించి.. సేవలను అభినందించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘అన్నం’ ఫౌండేషన్‌ కొనసాగుతోంది. దిక్కులేని వారినేగాక మతిస్థిమితం లేనివారికి ఆశ్రయం కల్పించి బాగు చేసే వరకు బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని గోలాఘాట్‌ జిల్లా బోటియాపూరికి చెందిన చునీల్‌ గొగొయ్‌ నాలుగేళ్ల క్రితం, జార్ఖండ్‌ లోని ఖుర్దేగ్‌ జిల్లాకు చెందిన మర్కస్‌ ఖుజూర్‌ రెండేళ్ల క్రితం మతిస్థిమితం తప్పడంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఖమ్మం చేరారు.


శ్రీనివాసరావుకు అస్సాంవాసుల పాదపూజ

వారిని అన్నం ఫౌండేషన్‌ చేరదీసింది. ఇటీవల వారి ఆరోగ్యం కుదుటపడింది. చునీల్‌ గొగొయ్‌ ఆశ్రమంలో వంటలు చేస్తూ ఉంటున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొత్తగూడెం జిల్లా ఇల్లెందువాసి అయిన గుహవాటి ఐఐటీ ప్రొఫెసర్‌ నందకిషోర్‌ సహకారంతో కుటుంబీకుల సమాచారం తెలుసుకున్నారు. అలాగే ఖజూర్‌ వివరాలు కూడా తెలిశాయి. దీంతో ఈ నెల 3న శ్రీనివాసరావు, ఆశ్రమం బాధ్యులు వారిని తీసుకుని ఆ రాష్ట్రాలకు బయలుదేరారు.

జార్ఖండ్‌ వెళ్లి అక్కడ ఖుజూర్‌ను జిల్లా జడ్జి సమక్షంలో ఆయన కుటుంబానికి అప్పగించారు. ఖుజూర్‌కు రూ.25 వేల నగదు అందించారు. ఫౌండేషన్‌ సేవలను తెలుసుకున్న జడ్జి శ్రీనివాస్‌రావుకు నమస్కరించారు. ఆపై గోలాగాట్‌ జిల్లా కేంద్రానికి 7న చేరుకుని జిల్లా జడ్జి ఎదుట చునీల్‌ గొగొయ్‌ను కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కూడా రూ.50 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా చునీల్‌ కుటుంబం శ్రీనివాసరావుకు పాదపూజ చేసింది.

మరిన్ని వార్తలు