వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్‌

14 Apr, 2021 03:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయను న్నారు. ఫలితాలు వెలువడిన తరువాత మేయర్‌/ చైర్‌పర్సన్‌ల ఎన్నిక కోసం విడిగా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈనెల 29 లేదా 30న పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం. ఈ మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓట్లగణన పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

తుది ఓటర్ల జాబితా రాగానే కార్పొరేషన్లలో డివిజన్లకు, మునిసి పాలిటీల్లో వార్డులకు రిజర్వేషన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించనున్నట్లు మునిసిపల్‌ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘా నికి సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కరోనా నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు