రాజ్‌భవన్‌లో బిల్లుల పెండింగ్‌పై 'నేడు సుప్రీంలో విచారణ'

27 Mar, 2023 02:10 IST|Sakshi

కౌంటర్‌ దాఖలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం 

ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన గవర్నర్‌ తమిళిసై 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య విభేదాల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు బిల్లుల వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. గవర్నర్‌ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా ఈ నెల 20న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌... కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపడం తెలిసిందే.

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు నోటీసులు జారీ చేయలేమని వ్యాఖ్యానించిన ధర్మాసనం... కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయమై అనుసరించాల్సిన వ్యూహంపై గవర్నర్‌ తమిళిసై ఢిల్లీలోని న్యాయ నిపుణులతో చర్చించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

సోమవారం జరిగే విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో కేంద్రం అభిప్రాయంతోపాటు రాజ్‌భవన్‌ వైఖరి సైతం వెల్లడి కానుంది. ఈ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశభావంతో ఉంది. 

194 రోజులుగా పెండింగ్‌లో 7 బిల్లులు.. 
గతేడాది సెప్టెంబర్‌ 13న శాసనసభ, శాసన మండలి ఆమోదించిన మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అందులో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్‌ ఆమోదం తెలిపారు. మిగతా ఏడు బిల్లులు 194 రోజులుగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ప్రైవేటు వర్సిటీల బిల్లు ముఖ్యమైనది.

ఈ బిల్లుపై గవర్నర్‌ పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతేడాది నవంబర్‌ 8న రాజ్‌భవన్‌కు వెళ్లి అనుమానాలను నివృత్తి చేశారు. అయినా బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయింది. మరోవైపు వర్సిటీల్లో బోధన, బోధనేతర విభాగాల కొలువుల భర్తీ జరగక ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ యూనివర్సిటీగా మార్పు ప్రతిపాదన బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్టం బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ బిల్లు, మోటార్‌ వెహికల్స్‌ ట్యాక్సేషన్‌ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 12న శాసనసభ, మండలి ఆమో దించిన ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు