19న బంగాళాఖాతంలో అల్పపీడనం

18 Aug, 2022 01:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో ఈ తుపాను బలపడనున్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడింది.

రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 49.92 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావలసిఉండగా, బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు