హైదరాబాద్‌: బంగారం చోరీ కేసులో మరో​ ట్విస్ట్‌.. 

2 Dec, 2022 14:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్‌లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు చోరీ చేసిన వాహనాలతోనే దోపిడీకి నిందితులు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఫింగర్‌ ప్రింట్స్‌, సీసీ ఫుటేజీ విజువల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. దుండగులందరూ 25 ఏళ్ల యువకులు కాగా, ముఖం కనిపించకుండా ఫేస్‌ మాస్క్‌లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు. 

అయితే, కల్యాణ్‌ చౌదరి (34) స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్‌– 6లో మహదేవ్‌ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ..  ఎన్‌జీవోస్‌ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్‌ చౌదరితో పాటు సుఖ్‌దేవ్‌ గాయపడ్డారు. 

బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? 
సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని గణపతి జ్యువెల్లర్స్‌ నుంచి సుఖ్‌దేవ్‌ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్‌ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం.      

సీసీ పుటేజ్‌ పరిశీలిస్తున్న పోలీసులు.. 
కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్‌ఓటీ, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు