కీసర నాగరాజా మజాకా! 

26 Sep, 2020 05:23 IST|Sakshi

అక్రమంగా రూ.48.8 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఇతరులకు ధారాదత్తం 

కీసర మాజీ తహసీల్దార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ  

సాక్షి, హైదరాబాద్‌: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్‌ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. 

మరిన్ని వార్తలు