బదిలీ నిబంధనపై గుబులు 

27 Mar, 2023 03:01 IST|Sakshi

ఒకేచోట మూడేళు దాటితే బదిలీ తప్పదన్న ఈపీఎఫ్‌ఓ 

క్లరికల్‌ ఉద్యోగుల్లో ఆందోళన 

పిల్లల చదువులు ఇబ్బందుల్లో పడతాయని ఆవేదన 

సాక్షి, హైదరాబాద్‌:  ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎప్‌ఓ) పరిధిలో ఉద్యోగులకు సంబంధించి సంస్థ తీసుకొచ్చిన నూతన బదిలీ విధానం–2022 క్లరికల్‌ స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈపీఎఫ్‌ఓలో క్లర్క్‌(సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌) లేదా సీనియర్‌ క్లర్క్‌ (సీనియర్‌ సొషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌) ఒకేచోట మూడు సంవత్సరాల సర్విసు పూర్తి చేసుకుంటే వెంటనే ఇతర కార్యాలయానికి బదిలీ చేయాలనేది పాలసీలోని ప్రధానాంశం.

ఈపీఎఫ్‌ఓ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచేందుకు ఈ తరహా మార్పు తప్పనిసరి అని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌ 12న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న వారికి ఏటా నిర్వహించే బదిలీలకు సంబంధించిన నిబంధనలను వివరించింది.

అయితే ఎలాంటి నిర్ణయాధికారాలు లేని క్లర్క్‌ స్థాయి ఉద్యోగికి కూడా ఈ నిబంధన వర్తింపజేసి మూడేళ్లకోసారి బదిలీ చేయడం వల్ల వారి కుటుంబాల భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

కావాలంటే సెక్షన్లు మార్చండి.. 
ఈపీఎఫ్‌ఓకు సంబంధించి తెలంగాణలో ఎనిమిది చోట్ల కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా, మాదాపూర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలో ఇవి కొనసాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరులో ఈ కార్యాలయాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 వేల వరకు క్లరికల్‌ ఉద్యోగులుంటారు.

కాగా ఈపీఎఫ్‌ఓ తాజా నిబంధనతో వీరు ఆ రాష్ట్ర పరిధిలోని ఏ కార్యాలయానికైనా బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని అమలు చేస్తే తమ పిల్లల చదువులు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, భవిష్యత్తులో స్థానికత అంశం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. బదిలీ చేయాలనుకుంటే ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి కాకుండా.. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలోనే సెక్షన్ల మార్పు చేస్తే ఉద్యోగికి వెసులుబాటు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

దీనివల్ల ఉద్యోగికి బదిలీ సమయంలో ఇచ్చే ఒక నెల అదనపు వేతనానికి సంబంధించిన నిధులు కూడా సంస్థకు మిగులుతాయని చెబుతున్నారు. ఈ మేరకు క్లరికల్‌ కేడర్‌ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. మరోవైపు నూతన పాలసీ అమల్లోకి వచ్చి రెండు నెలలు కావస్తుండడం, త్వరలోనే బదిలీలు చేసే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల సంఘం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు