స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది

22 Oct, 2022 02:03 IST|Sakshi
సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

భిన్నరంగాల్లో విజేతలకు సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డులు అభినందనీయం: ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్, వైఎస్‌ భారతిరెడ్డి చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం 

కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన సాక్షి ఈడీ వి.మురళి.. 

వందన సమర్పణ చేసిన కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ రాణిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌:  విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్‌ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్‌ చేస్తున్నానని విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌  విశ్వభూషణ్‌ హరిచందన్, వైఎస్‌ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్‌ఎన్‌ రెడ్డి, భారతి సిమెంట్స్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్‌ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్‌పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్‌ వీసీ ఎస్వీ కోటారెడ్డి  

పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్‌ పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్‌పర్సన్‌గా రెయిన్‌బో ఆస్పత్రి డైరెక్టర్‌ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్‌ కె అగర్వాల్, సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్టడీస్‌ డైరెక్టర్‌ కన్నెగంటి రమేష్‌ సభ్యులుగా వ్యవహరించారు.  

మరిన్ని వార్తలు