ప్రాణాంతకంగా ‘లిఫ్ట్‌ బటన్‌’ 

10 Sep, 2020 09:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని అపార్ట్‌మెంట్‌వాసులకు ‘‘లిఫ్ట్‌ బటన్‌’’ కాటేస్తుంది. ఫ్లాట నుంచి గడపదాటకుండానే కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే కనిపిస్తున్నా... వైరస్‌ ఏ రూపంలో, ఏ మూల నుంచి దాడి చేస్తుందో ? తెలియని పరిస్థితి నెలకొంది. ఫ్లాట్‌ నుంచి  బయటికి వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు  తీసుకుంటున్నా... అపార్ట్‌మెంట్‌కు వచ్చే వారికి కట్టడి లేకపోవడం ప్రమాదకరంగా తయారైంది. రోగనిరోధక శక్తిని బట్టి కొందరికి  వైరస్‌ సోకినా కరోనా లక్షణాలు కనబడవు. పైకి మాత్రం ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఆలాంటి వారు అపార్ట్‌మెంట్‌కు వచ్చి లిఫ్ట్‌ వినియోగించడం ఫ్లాట్‌వాసుల పట్ల ప్రాణాంతకరంగామారుతోంది. కరోనా వ్యాధిగ్రస్తుడు లిఫ్ట్‌ బటన్‌ నొక్కి వెళ్లి పోగా ఆ తర్వాత లిఫ్ట్‌ బటన్‌ నొక్కే వారందరికీ  వైరస్‌ సోకుతుంది. ఈ తరువాత వారి ద్వారా కుటుంబ సభ్యులకు, అ తర్వాత మిగితా ఫ్లాట్స్‌ వారు క్రమనంగా కరోనాబారిన పడుతున్న సంఘటనలు అనేకం. 

లోహంపై ప్రభావం 
అపార్‌మెంట్స్‌లలో లిఫ్ట్‌ బటన్‌ ప్రాణాంతకరంగా  మారుతోంది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా  వైరస్‌ వ్యాపిస్తోంది. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు,  వస్తువులు, ఇతర ఉపరితలాలపై పడతాయి కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి. కరోనా వైరస్‌లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిమిరహితం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్‌ మీద తొమ్మిది రోజుల వరకూ  జీవించి ఉంటాయని, వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని తెలుస్తోంది.  దీంతో లిఫ్ట్‌  వినియోగం కూడా ప్రమాదకరంగా తయారైంది. 

35 శాతం కుటుంబాలు 
హైదరాబాద్‌ మహా నగరంలోని సుమారు 35 శాతం పైగా కుటుంబాలు అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నట్లు అంచనా. నగరంలో  ఇండిపెండెంట్‌ గృహం కొనడానికి కానీ, అద్దెకు ఉండటానికి గాని సామాన్యులు, మధ్య తరగతి వారికి అందుబాటులో లేని కారణంగా ఆపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌పైనే ఆసక్తి కనబర్చుతుంటారు. కరోనా విశ్వ రూపం ప్రదరిస్తుండటంతో ఆదిలో అపార్ట్‌మెంట్‌లో రాకపోకలకు కట్టడి చర్యలు చేపట్టినా.. ఆ తర్వాత గాలికి వదిలేశారు.లాక్‌డౌన్‌ సడలింపు కొన్ని రంగాలు అన్‌లాక్‌గా మారడంతో  అపార్ట్‌మెంట్స్‌కు రాకపోకలు అధికమయ్యాయి.దీంతో పలు అపార్ట్‌మెంట్‌వాసులు  కరోనా  బారిన పడుతున్నారు. కరోనా మృతుల్లో అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

బయటపడని వైనం 
అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్స్‌లో నివాసం ఉండే వారిలో ఎవరి ప్రపంచం వారిది. ఇరుగు పోరుగు వారికి వరుసలు పెట్టి పిలువడం లాంటి పలకరింపులు  దేవుడేరుగు కానీ, ఎదురు పడితే కనీస పలకరింపులు కూడా ఉండవు. ఎవరు ఎక్కడి నుంచి  వస్తున్నారు...ఎప్పుడు ఎవరూ ఎక్కడి వెళ్తున్నారు తెలియదు. ఎవరికైనా  ఆరోగ్యంలో ఏమైనా మార్పు కనిపిస్తే..అనుమానం ఉంటే ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవడం.. పాజిటివ్‌ వస్తే గుట్టుచప్పుడు కాకుండా హోమ్‌ ఐసోలేషన్‌కు పరిమితం కావడం సర్వసాధరణమైంది. కనీసం  పక్క ఫ్లాట్‌ వారికి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ మేకపోతు గాంభీర్యం నటిస్తుంటారు. రోగనిరోధక శక్తితో కొందరు హోమ్‌ ఐసోలేషన్‌తోనే కోలుకుంటుండగా, మరికొందరు పరిస్ధితి విషమించి ఆసుపత్రికి వెళ్లడమో లేదా... ఫ్లాట్‌లోనే  మృత్యువాత పడటం పరిపాటిగా తయారైంది.   

మరిన్ని వార్తలు